Mar 09,2023 22:12

చిట్టగాంగ్‌: మూడు టి20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్‌ జట్టు సంచలనం విజయం సాధించింది. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 157పరుగుల లక్ష్యాన్ని కేవలం 18 ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు సాల్ట్‌(38), కెప్టెన్‌ బట్లర్‌(67) తొలి వికెట్‌కు 80 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత మలాన్‌(4), మొయిన్‌(8), శ్యామ్‌ కర్రన్‌(6), వోక్స్‌(1) నిరాశపరచడంతో ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌పై ఆశలు వదులుకుంది. దీంతో ఇంగ్లండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 6వికెట్లు కోల్పోయి 156పరుగులే చేయగల్గింది. మహ్మద్‌కు రెండు, నజుమ్‌, తస్కిన్‌, ముస్తఫిజుర్‌, షకీబ్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఛేదనలో భాగంగా బంగ్లా ఓపెనర్లు లింటన్‌ దాస్‌(12), తాలుక్దార్‌(21) నిరాశపరిచినా.. నజ్ముల్‌(51; 30బంతుల్లో 8ఫోర్లు), షకీబ్‌(34నాటౌట్‌; 24బంతుల్లో 6ఫోర్లు) నిలకడగా ఆడి మ్యాచ్‌ను ముగించారు. దీంతో బంగ్లాదేశ్‌ జట్టు 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో మూడు టి20ల సిరీస్‌లో బంగ్లాదేశ్‌ 1-0 ఆధిక్యతలో ఉండగా.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ నజ్ముల్‌ హొసైన్‌కు లభించింది. రెండో టి20 ఢాకా వేదికగా ఆదివారం జరగనుంది.