Dec 16,2022 10:17
  • వరుస రెండు వేలంలోనూ నిరాసే
  • అందుకే ఓవర్‌డ్రాఫ్ట్‌పైనే ఆధారం
  • వరుసగా ఓడీలతోనే కాలక్షేపం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ప్రతి వారం రిజర్వ్‌బ్యాంకు నిర్వహించే బహిరంగ మార్కెట్‌ రుణాల వేలం పాటలో రాష్ట్రానికి ఎదురుదెబ్బ తగులుతోంది. ఈ నెల ఇప్పటివరకు జరిగిన రెండు వేలంలో రాష్ట్రానికి అవకాశం లేకుండాపోయింది. కేంద్రం ప్రకటించిన పరిమితికి మించి రుణాలు తీసుకోవడం వల్లనే కొత్త రుణాలకు అవకాశం లేకుండాపోయిందని అధికారులు అంగీకరిస్తున్నారు. అందుకే ఎక్కువగా ఓవర్‌డ్రాఫ్ట్‌పైనే ఆధార పడాల్సి వస్తోందని వారంటున్నారు. రాష్ట్రానికి దాదాపు 48 వేల కోట్లు రుణం తీసుకునేందుకు అనుమతి ఇవ్వగా, అది ఇప్పటికే దాటిపోయినట్లు తేలింది. అదనపు రుణానికి అనుమతి ఇవ్వాలని పలు దఫాలుగా కేంద్రానికి రాష్ట్ర ఆర్ధికశాఖ లేఖలు రాసినప్పటికీ సానుకూల స్పందన లభించడం లేదని చెబుతున్నారు. అందుకే రెండు సెక్యూరిటీ వేలాల్లోనూ రుణానికి రాష్ట్రం దరఖాస్తు కూడా చేసుకోలేదని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఈ వారంలోనే ఢిల్లీకి వెళ్లాలని ఆర్ధికశాఖ అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ అధికారులతో భేటీ అయి కొత్తగా అదనపు రుణాన్ని కోరాలని భావిస్తున్నారు. మార్కెట్‌ రుణాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ నెల అంతా ఓవర్‌డ్రాఫ్ట్‌లతోనే కాలక్షేపం చేయాల్సి వచ్చింది. తొలి రోజే ఓడీతో ప్రారంభమైన ఖజానా ఎనిమిది రోజులపాటు అదే తోవలో పయనించింది. ఓడీ పరిమితి దాటిపోతున్న నేపథ్యంలో కొత్తగా ఇతర సంస్థల పేరిట రుణాలు తీసుకువచ్చి ఓవర్‌డ్రాఫ్ట్‌ నుంచి బయటకు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే 13వ తేదీన మళ్లీ 2100 రూపాయల వరకు ఓడీలోకి వెళ్లడం గమనార్హం. ఇదే తరహాలో మళ్లీ మళ్లీ తిరిగి ఓడీలోకి వెళ్లకతప్పని పరిస్థితులు నెలకొంటున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.