Feb 14,2023 22:06
  • మహిళల ఐపిఎల్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన బిసిసిఐ

ముంబయి: మహిళల ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యుపిఎల్‌) షెడ్యూల్‌ను భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) మంగళవారం విడుదల చేసింది. ఆటగాళ్ల వేలం సోమవారంతో ముగియడంతో ఆరంభ సీజన్‌కు రంగం సిద్ధం చేసింది. నవీ ముంబయిలోని డివై పాటిల్‌ స్టేడియంలో గుజరాత్‌ జెయింట్స్‌-ముంబయి ఇండియన్స్‌ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సీజన్‌ ప్రారంభం కానుంది. టి20 ఫార్మాట్‌లో జరిగే ఈ మ్యాచ్‌ మార్చి 4న జరగనుంది. 2023 సీజన్‌లో 20 లీగ్‌ మ్యాచ్‌లు, 2ప్లే ఆఫ్స్‌ జరగనుండగా.. మొత్తం 23రోజుల పాటు డబ్ల్యుపిఎల్‌ టోర్నీ జరగనుంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, యుపి, గుజరాత్‌ జట్లు తలపడనున్నాయి. ఐదు జట్లు గ్రూప్‌ దశలో ఒక్కో టీమ్‌తో రెండేసిసార్లు తలపడనున్నాయి. అలాగే ప్రతిరోజు ఒక్కోమ్యాచ్‌ జరగనుండగా.. మార్చి 5న రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆరోజు బెంగళూరు-ఢిల్లీ జట్లు బ్రాబౌర్న్‌ స్టేడియంలో, యుపి వారియర్స్‌-గుజరాత్‌ జట్లు డివై పాటిల్‌ స్టేడియంలో మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇక బెంగళూరు జట్టు రూ.3.40కోట్ల అత్యధిక ధరకు భారత మహిళా క్రికెటర్‌ స్మృతి మంధానాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. లీగ్‌లో భాగంగా మొత్తం 4 డబుల్‌ హెడ్డర్‌ మ్యాచ్‌లు జరగనుండగా.. మధ్యాహ్నం 3.30గం||లకు, రాత్రి 7.30గం||లకు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫైనల్‌ లీగ్‌ మ్యాచ్‌ మార్చి 21న ఢిల్లీ-యుపి జట్ల మధ్య బ్రాబౌర్న్‌ స్టేడియంలో, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు మార్చి 24న డివై పాటిల్‌ స్టేడియంలో జరగనున్నాయి. ఇక డబ్ల్యుపిఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ బ్రాబౌర్న్‌ స్టేడియంలో మార్చి 26న జరగనుంది.

1