ముంబాయి : దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ నెగ్గిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఈ విజయానికి పురస్కారంగా యంగ్ ఇండియాకు రూ.5 కోట్లు అందించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ఒక ప్రకటనలో తెలిపారు. 'ఇది మనమంతా గర్వించదగ్గ తరుణం. ఈ విజయంలో భాగస్వాములైన ప్లేయర్లు, జట్టు కోచింగ్ సిబ్బందికి రూ. 5 కోట్లు ఇవ్వనున్నాం' అని షా పేర్కొన్నారు. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే మూడో టీ20 మ్యాచ్‌కు జై షా ఆహ్వానించారు. మ్యాచ్ సందర్భంగా యువ క్రికెటర్లను ఘనంగా సత్కరిస్తామని తెలిపారు. కాగా, ప్రపంచ విజేతలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా కలిసి అభినందిస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించాల్సి ఉంది.










