అహ్మదాబాద్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాల్గో టెస్ట్‌లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్లతో రాణించాడు. అశ్విన్‌కు తోడు ఓవర్‌నైట్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 255పరుగులతో శుక్రవారం రెండోరోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు 480 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(180; 422బంతుల్లో 21ఫోర్లు) టాప్ స్కోరర్. రెండోరోజు ఆటలో భాగంగా ఆల్‌రౌండర్ గ్రీన్(114; 170బంతుల్లో 18ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ కలిసి 5వ వికెట్‌కు 208పరుగుల భాగస్వామ్యాని నెలకొల్పారు. ఈ జోడీని రవిచంద్రన్ అశ్విన్ విడదీశాడు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్‌లో లియాన్(34), మర్ఫీ(41) బ్యాటింగ్‌లో రాణించడంతో ఆస్ట్రేలియా జట్టు భారీస్కోర్‌ను నమోదు చేసింది. అశ్విన్‌కు ఆరు, షమీకి రెండు, జడేజా, అక్షర్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారతజట్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 36పరుగులు చేసింది. రోహిత్(17), శుభ్‌మన్(18) క్రీజ్‌లో ఉన్నారు.
కుంబ్లే రికార్డును బ్రేక్ చేసిన అశ్విన్
చెన్నైకు చెందిన రవిచంద్రన్ అశ్విన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గో టెస్ట్‌లో ఓ రికార్డును నెలకొల్పాడు. స్వదేశంలో అత్యధికంగా ఐదుకు పైగా వికెట్లు తీసిన కుంబ్లే రికార్డును అశ్విన్ తాజాగా బ్రేక్ చేశాడు. రెండో రోజు ఆటలో భాగంగా అశ్విన్(6/91) ఐదుకు పైగా వికెట్లను సాధిచాడు. దీంతో స్వదేశంలో ఐదు, ఐదుకుపైగా వికెట్లు తీసిన కుంబ్లే(25సార్లు) రికార్డును బ్రేక్ చేశాడు. అశ్విన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 26వసారి స్వదేశంలో ఐదుకు పైగా వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.
ఖవాజా క్రీజ్‌లో 10గంటలు...
ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా తొలి రోజంతా క్రీజ్‌లో ఉండగా.. రెండోరోజు కూడా భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. దాదాపు 10 గంటలకు పైగా క్రీజ్‌లో ఉన్న ఖవాజా.. 422 బంతులను ఆడి 21 ఫోర్ల సాయంతో 180పరుగులు చేసాడు. ఈ క్రమంలో డబుల్ సెంచరీ దిశగా వెళ్తున్న ఖవాజాను అక్షర్ ఎల్‌బిడబ్ల్యూగా ఔట్ చేశాడు. ఇక గ్రీన్‌తో కలిసి ఖవాజా ఐదో వికెట్‌కు 208 పరుగులు జోడించాడు.
స్కోర్‌బోర్డు..
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: హెడ్ (సి)జడేజా (బి)అశ్విన్ 32, ఖవాజా (ఎల్‌బి)అక్షర్ 180, లబూషేన్ (బి)షమీ 3, స్మిత్ (బి)జడేజా 38, హ్యాండ్‌కోంబ్ (బి)షమీ 17, గ్రీన్ (సి)శ్రీకర్ భరత్ (బి)అశ్విన్ 114, అలెక్స్ క్యారీ (సి)అక్షర్ (బి)అశ్విన్ 0, స్టార్క్ (సి)శ్రేయస్ (బి)అశ్విన్ 6, లియాన్ (సి)కోహ్లి (బి)అశ్విన్ 34, మర్ఫీ (ఎల్‌బి) అశ్విన్ 41, కుహ్నెమన్ (నాటౌట్) 0, అదనం 15. (167.2 ఓవర్లలో ఆలౌట్) 480పరుగులు.
వికెట్ల పతనం: 1/61, 2/72, 3/151, 4/170, 5/378, 6/378, 7/387, 8/409, 9/479, 10/480
బౌలింగ్: షమీ 31-3-134-2, ఉమేశ్ 25-2-105-0, అశ్విన్ 47.2-15-91-6, జడేజా 35-5-89-1, అక్షర్ 28-8-47-1, శ్రేయస్ 1-0-2-0
ఇండియా తొలి ఇన్నింగ్స్: రోహిత్ (బ్యాటింగ్) 17, శుభ్‌మన్ (బ్యాటింగ్) 18, అదనం 1. (10 ఓవర్లలో) 36పరుగులు.
బౌలింగ్: స్టార్క్ 3-1-7-0, గ్రీన్ 2-0-11-0, లియాన్ 3-0-14-0, కుహ్నెమన్ 2-0-3-0.










