అది ఏడో తరగతి గది. సైన్సు మాష్టారు అనర్గళంగా మొక్కలు, వాటి ఉపయోగాల గురించిన పాఠం చెబుతున్నారు. విద్యార్థులూ అంతే శ్రద్ధగా వింటున్నారు. బయట కుండపోతగా వర్షం కురుస్తుంది.
ఒక్కసారిగా క్లాసులో గుసగుసలు ప్రారంభమయ్యాయి. అది పందెం గొడవ. కిటికీ పక్కన కూర్చున్న ఇద్దరు విద్యార్థుల మధ్య. కొద్దిసేపటికి ఆ పందెం చిలికి చిలికి గాలివాన అయ్యింది. గుసగుసలు రసాభాస స్థాయికి చేరాయి. ఇద్దరినీ నిల్చోమన్నారు మాష్టారు.
రవి, గోపి నిల్చున్నారు. 'ఏంటి మీ గొడవ..?' గద్దించి అడిగారు మాస్టారు. 'పాఠంపైనే ఒక పందెం..!' అంటూ నసిగాడు రవి. ఆశ్చర్యపోయిన మాష్టారు 'పాఠం పైన పందెమా! ఏంటది?' నిలదీశారు.
'గ్రౌండ్లో సైడు స్టాండ్ వేసి ఉన్న మీ బైకు ఈ వర్షానికి పడిపోతుందని గోపి అంటున్నాడు. పడదని నేనంటున్నాను. పందెం అంటూ రెచ్చగొడుతున్నాడు గోపి. నేనే గెలుస్తాను!' ఆత్మవిశ్వాసంతో చెప్పాడు రవి.
పందెం అనేసరికి పిల్లల్లో హుషారు పుట్టుకొచ్చింది. గోపి గెలుస్తాడని కొందరు విద్యార్థులంటే, రవి గెలుస్తాడని మరికొందరు వాదించుకుంటున్నారు. మరికొందరైతే సైన్సు మాస్టారు ఇద్దరిపై వేయబోయే చిందుల్ని ఊహించుకుంటున్నారు.
తను చెప్పే పాఠంలోని సారాంశాన్ని ఆకళింపు చేసుకున్న వైనం ఈ పందెంలో అంతర్లీనంగా ఉన్నట్టు అర్థమైంది మాస్టారుకి. పిల్లలందరి తెలివికీ పదును పెట్టాలనుకున్నారు మాష్టారు.
'పిల్లలూ! ఈ పందెంలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు?' అని మాష్టారు అనడంతో పిల్లలంతా అవాక్కయ్యారు. చీవాట్లు పెడతారనుకున్న మాష్టారు తమతో సరిసమానంగా వంత పాడడంతో తరగతిగదిలో ఒక్కసారిగా కోలాహలం ప్రారంభమయ్యింది. పిల్లలు వర్గాలుగా విడిపోయి వారి నిర్ణయాలను తెలిపారు.
అప్పుడు మాష్టారు.. 'రవీ! బైకు పడదని ఎలా చెప్పగలవు?' అడిగారు మాష్టారు.
'సార్! మీ బైకు పచ్చిక మీద ఉంది. పచ్చికకు కూడా భూమి లోపలికి వేళ్ళు బలంగా పాతుకుని ఉంటాయి. పడుతున్న వర్షపు నీటి ప్రవాహానికి ఆ పచ్చిక నేల కోతకు గురికానివ్వదు. అందుకే బైకు పడదని చెప్పాను. చెట్లు ఎక్కువ ఉన్న చోట నేలకోతకు గురికాదని పాఠంలో మీరు కూడా చెబుతున్నారు కదా!' వివరణ ఇచ్చాడు రవి.
సైన్సు మాష్టారు చప్పట్లతో 'వెరీగుడ్' అంటూ రవి సమాధానాన్ని స్వాగతించారు.
'పిల్లలూ! పాఠం వినడం సాధారణ విషయం. దానిని నిత్యజీవితంలో అన్వయించుకోవడం చాలా అవసరం. ఇప్పుడు రవికే ఎక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి, ఈ క్లాసులో ఎక్కువ మందే ఈ విషయాన్ని ఆకళింపు చేసుకున్నారని అర్థమౌతుంది. మిగిలిన వారు కూడా అలాగే పాఠాలు చెప్పటం అయిపోయిన తరువాత చర్చించుకోవడం, అర్థం కాకపోతే అడిగి చెప్పించుకోవడం చేయండి. అటువంటి ప్రతిభ ఉన్నత స్థాయికి తీసుకు వెళ్తుంది.. సరేనా!' అంటూ ముగించారు.
బి.వి.పట్నాయక్
8309872913