అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. మంగళవారం మధ్యాహ్నం 12గంటల నుంచి దాదాపు ఐదు గంటల పాటు వాదనలు కొనసాగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. ఐదుగురు న్యాయవాదులు ఈ కేసులో వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా కొనసాగిన వాదనల్లో పలు కీలక అంశాలను న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ, అసలు ఈ కేసులో అవకతవకలు జరిగాయా? లేదా? డబ్బులు పోయాయని ఒకవైపు సీఐడీ ఆరోపిస్తున్నప్పటికీ.. అసలు ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో ఆధారాలు చూకపపోవడం, నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఇప్పటికీ తెరిచే ఉండటం, వాటిలో యువతకు శిక్షణ సైతం కొనసాగుతున్న పరిస్థితులను కోర్టుకు వివరించింది. ఎన్నికల వేళ కావాలనే కుట్రపూరితంగా ఈ కేసులో చంద్రబాబును ఇరికించారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఫిర్యాదే ఓ అభూత కల్పన అని, ఎఫ్‌ఐఆర్ చట్టవిరుద్ధంగా ఉందంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా హైకోర్టు ధర్మాసనం ముందు తమ వాదనలు వినిపించారు.
మరోవైపు, అటు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ప్రధానంగా షెల్ కంపెనీల ద్వారా నగదు వెళ్లిందని.. ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్లిందో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాల్సి ఉందని బెంచ్ ముందు వాదనలు వినిపించారు. ఈ దశలో కోర్టులు కలుగజేసుకోరాదన్నారు. కార్పొరేషన్ సంబంధించి న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాలని.. వాళ్లను సైతం చేర్చుకొనేందుకు మరో వారం రోజులు గడువు ఇవ్వాలని కోరారు. అన్ని వాదనలు బుధవారం వినిపించాలని ఒక దశలో బెంచ్ అనడంతో కౌంటర్ వాదనలు ఈరోజే వినిపించడంతో ఇరువైపుల వాదనలు ముగిశాయి. దీంతో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.










