Sep 21,2023 07:29
  • ఎసిబి కోర్టులోముగిసిన వాదనలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో భాగంగా రిమాండ్‌లో వున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని ఎసిబి కోర్టులో సిఐడి వేసిన పిటిషన్‌పై బుధవారం వాదనలు ముగిశాయి. సిఐడి తరపు న్యాయవాదులు, చంద్రబాబు తరపు వాదనలను విన్న ఎసిబి కోర్టు తీర్పును గురువారానికి వాయిదా వేసింది. చంద్రబాబును ఐదురోజులు సిఐడి కస్టడీకి ఇవ్వాలని సిఐడి తరపున అడిషనల్‌ అటార్ని జనరల్‌ పొన్నువోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్టు చేశారన్నారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న ప్రతిఒక్కరినీ మరింత విచారించాల్సి వుందన్నారు. ఈ కేసులో కుట్ర కోణాన్ని వెలికితీసేందుకు చంద్రబాబును పూర్తి స్థాయిలో విచారించాల్సి వుందన్నారు. నిధులు ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్లాయో సమాచారం వుందని, కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరారు. చంద్రబాబు తరపున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ్‌ లూథ్రా, సిద్ధార్థ్‌ అగర్వాల్‌ వాదనలు వినిపించారు. చంద్రబాబును కోర్టులో హాజరుపరిచిన సెప్టెంబరు 10న సిఐడి కస్టడీ కోరకుండా మరుసటి రోజు 11న కస్టడీ కోరుతూ పిటిషన్‌ ఎలా వేస్తుందన్నారు. చంద్రబాబు అరెస్టు ప్రక్రియంతా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్నారు. చంద్రబాబును అరెస్టు చేశాక విచారణ పేరుతో సిఐడి ఆఫీసులో వుంచారని తెలిపారు. కొన్ని గంటలపాటు విచారించి అన్ని విషయాలూ రాబట్టామని చెప్పి మళ్లీ ఇప్పుడు కస్టడీకి ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. 10న కోర్టులో ప్రవేశపెట్టాక 24 గంటల్లో దర్యాప్తు అధికారి నిర్ణయం మార్చుకున్నారని తెలిపారు. పాత అంశాలతో కస్టడీకి ఎలా కోరతారని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు ఎక్కడా ఆధారాల్లేవని, నాలుగేళ్లుగా ఎవరిని అరెస్టు చేసినా నిధుల దుర్వినియోగం పేరు చెబుతున్నారని పేర్కొన్నారు. దర్యాప్తు విషయాలపై సిఐడి మీడియా సమావేశాలు ఎలా పెడుతుందని ప్రశ్నించారు. ఇరువైపులా వాదనలు విన్న ఎసిబి కోర్టు జడ్జి తీర్పును గురువారానికి వాయిదా వేశారు.