Oct 06,2023 21:24

విజయవాడ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు ముగిసిన అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. సోమవారం తీర్పు వెలువరిస్తామని తెలిపింది. బెయిల్‌ పిటిషన్‌పై గురువారమే చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు పూర్తి కాగా.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మరికొన్ని వాదనలు వినిపిస్తానని కోర్టును కోరారు. దీంతో నేడు ఆయన మరికొన్ని అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఆ తర్వాత సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై వాదనలు జరిగాయి.సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదిస్తూ బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకోవాల్సి ఉందని.. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని కోరారు. అనంతరం చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే వాదనలు వినిపించారు. ఇప్పటికే ఒకసారి చంద్రబాబును పోలీసు కస్టడీకి ఇచ్చారని.. రెండోసారి ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.