- వర్షాకాలం వస్తున్నా పరిహారం అందజేతపై తాత్సారం
- పూర్తికాని నిర్వాసిత కాలనీలు
- ముంపు గ్రామాల లెక్కలపై స్పష్టత లేదు
ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : పోలవరం నిర్వాసితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికొదిలేశాయి. నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారంపై తాత్సారం చేస్తున్నాయి. 2022 జులైలో విరుచుకుపడిన వరద అనంతరం వేలేరుపాడులో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి 41.15 కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు వచ్చే అక్టోబర్‌లో పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిధులివ్వడం లేదని, మరింత ఒత్తిడి తెస్తామని అన్నారు. మళ్లీ వర్షాకాలం వస్తోన్నా ఇప్పటికీ నిర్వాసితులకు పరిహారం అందలేదు. నిర్వాసిత కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో, నిర్వాసితులను మళ్లీ వరద భయం వెంటాడుతోంది. ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని 107 గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మూడు కాంటూర్లుగా అధికారులు విభజించారు. ప్లస్ 35.00, ప్లస్ 41.15, ప్లస్ 45.72గా పేర్కొన్నారు. తొలివిడతగా పోలవరం మండలంలో ఎనిమిది గ్రామాలను ఖాళీ చేయించారు. ఈ గ్రామాల్లోని నిర్వాసితుల్లో చాలామందికి భూమికి భూమి, 18 ఏళ్లు నిండిన యువతకు పరిహారం సక్రమంగా అందించలేదు. ఇప్పుడు 41.15 కాంటూరుకు సంబంధించి కుక్కునూరు మండలంలో ఎనిమిది గ్రామాలను, వేలేరుపాడులో 15 గ్రామాలను ఖాళీ చేయించాల్సి ఉంది. మొత్తం ఈ 23 గ్రామాల్లో 7,071 కుటుంబాలను తరలించాల్సి ఉంటుంది. గడిచిన ఏడాది వరదలకు ప్రభుత్వం చెప్పిన కాంటూరు లెక్కలన్నీ బూటకమని తేలిపోయింది. కాఫర్ డ్యామ్ వద్ద 40 మీటర్లకు వరద నీరు చేరుకునే సరికే మొత్తం గ్రామాలన్నీ మునిగిపోయాయి. దీంతో, కుక్కునూరు, వేలేరుపాడు మండలంలోని గ్రామాల ప్రజలంతా నెలల తరబడి పునరావాస కాలనీల్లో తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ముంపునకు గురైన గ్రామాలను 41.15 కాంటూరులో కలపాలని గిరిజన సంఘాలు, సిపిఎం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఈ రెండు మండలాల్లో 18 గ్రామాలను 41.15 కాంటూరులో కలుపుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా గ్రామసభలు పెట్టి అవార్డు ప్రకటన ఇప్పటికీ చేయలేదు.
పరిహారంపై మాటమార్చిన ప్రభుత్వం
నిర్వాసితులకు పునరావాస పరిహారం కింద రూ.10.50 లక్షలు ఇస్తామని వైసిపి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, అలా ఇవ్వలేదు. టిడిపి ప్రభుత్వంలో ఇచ్చిన మాదిరిగానే రూ.6.36 లక్షలు మాత్రమే ఇస్తామని చెబుతోంది. ఇంటి విలువ పరిహారం, 18 ఏళ్లు నిండిన యువతకు ఇవ్వాల్సిన పరిహారం ఏ ఒక్కటీ ఇప్పటి వరకూ అందలేదు. 2006లో సేకరించిన భూములకు ఎకరాకు రూ.ఐదు లక్షల చొప్పున అదనంగా ఇస్తామని ప్రకటించిన పరిహారంపైనా నోరు మెదపడం లేదు. నిర్వాసితుల కోసం జీలుగుమిల్లి మండలంతోపాటు జంగారెడ్డిగూడెం వంటి చోట్ల కడుతున్న నిర్వాసిత కాలనీలు ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో గతేడాది వరదలను తలచుకుని నిర్వాసితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పోలవరం నిర్వాసితులపై కేంద్రం వ్యవహరిస్తోన్న తీరే ఇన్ని ఇబ్బందులకు కారణమనే అభిప్రాయం అక్కడి ప్రజల్లో వ్యక్తమవుతోంది.

అవార్డు పాస్‌చేసి పరిహారం ఇవ్వండి
తొలుత మా గ్రామాన్ని 45.72 కాంటూరులో చేర్చారు. గత ఏడాది జులైలో వరదలకు మా గ్రామం మొత్తం మునిగిపోయి ఇళ్లపై నుంచి వరదనీరు ప్రవహించింది. దీంతో, ఆందోళనలు చేయగా మా గ్రామాన్ని 41.15 కాంటూరులో చేర్చారు. అయితే, గ్రామసభలు నిర్వహించి అవార్డు మాత్రం చేయలేదు. మళ్లీ వర్షాకాలం వస్తుండడంతో భయమేస్తోంది. త్వరగా పరిహారం అందించాలి.
-గుంటుపల్లి రామాచారి,
బెస్తవారి గూడెం, కుక్కునూరు మండలం

ఇప్పటికీ పునరావాస కాలనీలోనే
గత ఏడాది జులైలో వరదలకు ఇల్లు మొత్తం మునిగిపోయి కూలిపోయింది. వరదల సమయంలో కివ్వాక పునరావాస కాలనీకి వచ్చి తలదాచుకున్నాం. పరిహారం ఇచ్చి, ఇల్లు నిర్మిస్తే వెళ్లిపోదామని చూస్తున్నా. ఇప్పటి వరకూ పరిహారం ఇవ్వలేదు.
-షేక్ ఇమామ్‌బి, కుక్కునూరు 'ఎ' బ్లాక్










