Apr 10,2023 12:36

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వేసవి వచ్చినా నీటి ఎద్దడి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్‌ప్లానుపై ఇంతవరకు దృష్టి సారించినట్లు లేదు. పట్టణ ప్రాంతాలకు సరఫరా అయ్యే అన్ని వనరులూ అడుగంటుతుండటంతో ఈసారి నీటి లభ్యత తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ వేసవిలో వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని ప్రకృతి విపత్తుల విభాగం ప్రకటించింది.
         రెండు డిగ్రీల నుండి నాలుగు డిగ్రీల వరకూ పెరగొచ్చని హెచ్చరించింది. వేసవిలో ఎద్దడిని నివారించేందుకు మార్చి నాటికే యాక్షన్‌ ప్లాను ప్రక్రియ పూర్తి చేయాలి. ఆ దిశగా తగిన చర్యలు తీసుకోలేదు. సమస్య ఉత్పన్నమైన తరువాత హడావుడిగా వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టడం లేదు. దీంతో సమస్య జఠిలం అవుతోంది. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో రోజు మార్చి రోజు నీటి సరఫరా జరుగుతోంది. అత్యవసర పరిస్థితుల్లోనూ, వేసవిలోనూ నీటిని సరఫరా చేసేందుకు ట్యాంకర్లు ఏర్పాటు చేసుకోవడం, పాడైన బోర్లను బాగుచేయడం వంటి చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఇప్పటి వరకూ చేయలేదు. రాయలసీమ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో గత ఏడాది మూడు, నాలుగు రోజులకు ఒకసారి మంచినీటిని సరఫరా చేశారు. గత ఏడాది అనుభవంతో ఈ ఏడాది సమస్యను పరిష్కరించాల్సి ఉన్నా ఇప్పటి వరకూ చర్యలు లేవు. ఆయా ప్రాంతాల్లో సమస్య మరీ తీవ్రంగా ఉంటోంది. తుంగభద్ర, కెసి కెనాల్‌, కృష్ణ, హంద్రీ చెంతనే ఉన్నా కర్నూలులో రెండు రోజులకు ఒకసారి, అదీ గంట సేపు మాత్రమే నీరు సరఫరా చేస్తున్నారు. ఒక కుటుంబం ఉన్నచోటే నీటి సమస్య ఉంటే నాలుగైదు ఇళ్లు కలిసి ఉన్నచోట ఇప్పటికీ తగాదాలు అవుతూనే ఉన్నాయి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో తీరని నీటి సమస్య నెలకొంది. కొడుమూరు, రాయచోటి, పత్తికొండ నియోజకవర్గాల్లోనూ సమస్య జఠిలంగా మారింది. పలుచోట్ల వ్యవసాయ బోరుబావుల వద్దకు వెళ్లి రైతులను అడిగి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. తాగేందుకు ఉపయోగపడకపోయినా అనివార్యంగా వాటినే తాగుతున్నారు. వాడుక నీళ్ల సమస్య చెప్పనవసరం లేదు. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనూ సమస్య తీవ్రమవుతోంది. ఇప్పటికే రెండు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్న నేపథ్యంలో అనివార్యంగా అనుకోని ఇబ్బంది ఎదురైతే నాలుగు రోజుల వరకూ తాగేందుకు నీరులేని దుస్థితిలో రాష్ట్రంలో పలుప్రాంతాల్లో నెలకొంది.