ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్:అనంతపురాన్ని కరువు జిల్లాగా ప్రకటించాలని, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం టవర్‌క్లాక్ సర్కిల్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్ మాట్లాడుతూ.. వర్షాభావంతో ఈ ఖరీఫ్ సీజన్‌లో కేవలం 61 శాతం మాత్రమే పంటల సాగు జరిగిందన్నారు. వేరుశనగ, కంది, ఆముదం తదితర ప్రధాన పంటలు వర్షాల్లేక ఎండిపోతున్నాయని తెలిపారు. సాధారణ దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు, పంట సాగు చేయని రైతులకు ఎకరాకు 30 వేలు, కార్మికులకు ఉపాధి హామీ పథకం ద్వారా అదనంగా వంద రోజులు పనులు కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణాల్లో వలసలు పెరుగుతున్నందున ఉపాధి పనులను పట్టణాల్లో కూడా కల్పించాలని కోరారు. సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుల్లోనూ, పనులు పూర్తి చేయడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందని విమర్శించారు. హెచ్‌ఎల్‌సి ఆధునికరణ పనులు మధ్యస్తంగా నిలిపివేయడం, నిర్వహణ లోపం వల్ల తుంగభద్ర నుంచి నీటిని తెచ్చుకునే పరిస్థితి లేదన్నారు. హంద్రీనీవా కాలువకు నీరు ఎప్పటి వరకు అందుతుందో స్పష్టంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అనంతపురాన్ని కరువు జిల్లాగా ప్రకటించి, అన్ని మండలాల్లో కరువు సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ.నల్లప్ప, జిల్లా నాయకులు ఎస్.నాగేంద్రకుమార్, వి.రామిరెడ్డి, ఆర్‌వి.నాయుడు, తదితరులు పాల్గోన్నారు.










