2014లో రూపాయికి డాలర్ మారకం విలువ 60.99. అదే 2023లో 83.15 అయ్యింది. పరిస్థితి ఇలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ప్రధాని, అతని సహచరులంతా దేశం ఆర్థిక ప్రగతి సాధించిందని దబాయిస్తారెందుకూ? వారికెవ్వరికీ కళ్ళూ, చెవులూ పని చేయడం లేదా? అందుకే కాబోలు మణిపూర్‌లో ప్రధాని మోడీ ఫొటోతో పోస్టర్లు వెలిశాయి. దాని కింద ఒక వాక్యం ఉంది. ''ఈయనకు కళ్ళు కనబడవు. చెవులు వినబడవు. ఇక్కడ మా మణిపూర్ మండిపోతున్నా ఆయనకు పట్టదు. విదేశాలకు పారిపోతుంటాడు'' అని !
ఈ దేశంలోని ప్రతి పౌరుడూ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి-1931లో విప్లవ వీరుడు భగత్‌సింగ్ పక్షాన తీవ్రంగా వాదించిన న్యాయవాది-ఆసఫ్ అలీ. భగత్‌సింగ్‌ను శిక్షించడానికి నిరాకరించి, తన జడ్జి పదవి కి రాజీనామా చేసిన జస్టిస్-సయ్యద్ ఆగా హైదర్. ఇకపోతే భగత్‌సింగ్‌కు ఉరిశిక్ష విధించిన జడ్జి-రారు సాహిబ్ పండిట్ శ్రీ కిషన్. నరనరాన ఆర్ఎస్ఎస్ భావజాలం నింపుకున్న వ్యక్తి. ఈ వివరాలు తెలుసుకున్న తర్వాత, లేదా గుర్తు చేసుకున్న తర్వాత ఎవరు దేశభక్తులు, ఎవరు దేశద్రోహులు. అనే విషయం విజ్ఞత గల ఈ దేశపౌరులు పూర్తిగా అర్థం చేసుకుంటారు.
తాము సనాతన ధర్మాన్ని గౌరవించేవారమని, దాన్ని వ్యతిరేకించే వారి వ్యాఖ్యలు తమ మనోభావాల్ని గాయపరుస్తున్నాయని, ఆ వ్యాఖ్యలు చేసే వారిని కఠినంగా శిక్షించాలని మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అలాంటి లేఖ రాసిన వారికి అసలు సనాతనమంటే ఏమిటన్నది అవగాహన ఉందా లేదా అని అనుమానం వస్తుంది. సనాతనమంటే- అసమానత, సనాతనమంటే-అస్పృశ్యత, సనాతనమంటే- కులవివక్ష, సనాతనమంటే బలులు, యజ్ఞయాగాలు, బాల్య వివాహాలు, సతీ సహగమనం, దళితుల సజీవ దహనం, సనాతనమంటే-సమాజపు సగ భాగపు అణచివేత. ఆధిపత్య హింస, శ్రామికుల పీడన. సనాతనమంటే-నిచ్చెన మెట్ల వ్యవస్థ. సనాతనమంటే-వర్తమానాన్ని గతం అజమాయిషీ చేయడం, సనాతనమంటే- భవిష్యత్తుకు అవరోధం. ఏ కొందరి మనోభావాలో దెబ్బతింటాయంటే, వారు తప్పక వారి ఆలోచనా సరళిని మార్చుకోవాల్సి ఉంటుంది. పైన చెప్పినవన్నీ నిజాలే కదా? నిజాలు కాదు, అబద్దాలు అని-ఎవరైనా నిరూపించదలిస్తే నిరూపించిన తర్వాత మాట్లాడాలి. సమకాలీనంలో కూడా సనాతనం చేసే అనర్ధాలెలా ఉంటాయో చూడండి. ఎప్పుడో మొదలైన కుంభమేళాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి కదా ?
1760-హరిద్వార్ కుంభమేళాలో శైవులైన గోసాయన్లకు వైష్ణవులైన బైరాగులకు మధ్య కలహాలు చెలరేగి ఇరువైపులా వందల సంఖ్యలో మరణాలు సంభవించాయి. మరాఠా పీష్వాల నాటి ఒక రాగి ఫలకం-మరికొన్ని భయంకరమైన విషయాలను వెల్లడించింది. 1789లో నాసిక్ కుంభమేళాలో సుమారు 12 వేల మంది మరణించారు. కారణం శైవులు-వైష్ణవులు హోరాహోరీగా పోట్లాడుకుని, కోపాలు, రోషాలు చల్లారక చంపుకోవడందాకా వెళ్ళింది. మేమంటే మేం-ముందు స్నానం చేయాలని గొడవపడి, శత్రువుల్లాగా ఒకరినొకరు చంపుకున్నారు. మొత్తం 12 వేల మంది పుణ్యస్నానాల పేరుతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. మతం పిచ్చి తలకెక్కితే అంతే! ఈ భక్తులు మానవత్వం మీద చెరగని మచ్చలుగా మిగిలారు తప్పితే, మతకలహాలతో ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా పొందగలిగారా ?
లోక కళ్యాణం గురించి, ప్రశాంత జీవన మార్గం గురించి, సత్ప్రవర్తన గురించి జనానికి బోధలు చేసే సన్యాసులు, సాధువులు, బైరాగులు యుద్ధాలకు దిగడం ఏమైనా బావుందా? అంటే వారు-సర్వసంగ పరిత్యాగులుగా వేషం మార్చారే గాని, తమలోని అహాన్ని జయించలేక పోయారని మనకు అర్థమౌతుంది. అలాంటి వారి నుండి సామాన్యులు నేర్చుకునేది ఏముంటుందీ? అలాంటి సన్యాసులు, దొంగయోగులు సమాజానికి కాదు కదా, వారికి వారే ఉపయోగం లేనివారు. అలాంటి వారిని సామాన్యులు నమ్మకూడదు. వారి బూటకపు ఆధ్యాత్మికతకు ప్రభావితులు కాకూడదు. అలాంటి వారిని దూరం పెట్టాలి. సమాజ శ్రేయస్సుకు పాటుపడిన మహనీయుల గూర్చి తెలుసుకుంటూ ఉండాలి. వారి మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. దైవమే లేనప్పుడు దైవం పేరు చెప్పి, సంస్కృతి సంప్రదాయాల పేరు చెప్పి, మోసం చేసే వారిని నమ్మడం అవసరమా? ఆలోచించాలి కదా ?
ఉదాహరణకు 2014లో రూపాయికి డాలర్ మారకం విలువ 60.99. అదే 2023లో 83.15 అయ్యింది. పరిస్థితి ఇలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ప్రధాని, అతని సహచరులంతా దేశం ఆర్థిక ప్రగతి సాధించిందని దబాయిస్తారెందుకూ? వారికెవ్వరికీ కళ్ళూ, చెవులూ పని చేయడం లేదా? అందుకే కాబోలు మణిపూర్‌లో ప్రధాని మోడీ ఫొటోతో పోస్టర్లు వెలిశాయి. దాని కింద ఒక వాక్యం ఉంది. ''ఈయనకు కళ్ళు కనబడవు. చెవులు వినబడవు. ఇక్కడ మా మణిపూర్ మండిపోతున్నా ఆయనకు పట్టదు. విదేశాలకు పారిపోతుంటాడు'' అని! మోడీ అనేది ఇంటి పేరు కాదు, ఆయన విద్యార్హతలు. మాస్టర్ ఆఫ్ డెవలపింగ్ ఇండియా-అని ఆయన అనుయాయులు ప్రచారం చేసుకుంటున్నది నిజం. కాని, హైస్కూల్ చదువు పూర్తి చేయనివాడు లోపాయికారిగా యం.ఎ. డిగ్రీ సంపాదించాడని ఈ దేశ ప్రజలకు తెలుసు. డబ్బు గుప్పించి నమ్మకంగా పడి ఉండేవాణ్ణి రెండుసార్లు ప్రధాని సీట్లో కూర్చోబెట్టిన కార్పోరేట్లకు తెలుసు. అందుకే ఆయన వారికి అతివిధేయుడిగా ఉన్నాడు. బిబిసి డాక్యుమెంటరీయే కాదు, ప్రపంచవ్యాప్తంగా 14 అంతర్జాతీయ పత్రికలు ఈయన అసమర్థత గూర్చి పూర్తి వివరాలు వెల్లడించాయి. ''కుట్ర చేయడం ఎంతతెలివిగా చేయాలంటే ఎదుటివారికి ఏ మాత్రం తెలియకూడదు. పైగా తనకు తానుగా వచ్చి కుట్రలో ఇరుక్కోవాలి. బలై, భస్మమైపోవాలి''- అన్నాడు విన్సెంట్ చర్చిల్. చర్చిల్ ఎప్పుడో చెప్పిన విషయాన్ని ఈ దేశ ప్రధాని ప్రజలమీద ప్రయోగిస్తున్నాడు. నిజం చెప్పుకోవాలంటే విపక్షాల అనైక్యత వల్ల ఆయన కొనసాగాడు తప్పించి, స్వీయ ప్రతిభతో రాణించింది ఎప్పుడూ ఎక్కడా? గజరాత్ గాయం, మణిపూర్ గాయం, దేశమంతా గాయాలమయమైపోతోంది. నిజమే! ఈ విషయాలు మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి !
దేశం కోసం-ధర్మం కోసం ఈ దేశ ప్రధాని చేస్తున్న అనేక సంస్కరణల్లో-గ్యాస్ సిలిండర్ ధర పెంచడం కూడా ఒకటి అని ఆ ఫలానా పార్టీ నాయకులు తెగ ప్రచారం చేస్తున్నారు. వారి వాదన ఏమిటో ఎంత సబబుగా ఉందో ఆలోచించండి. విషయం మీకే బోధపడుతుంది-''సిలిండర్లలో నింపే గ్యాస్ భూమి లోపల నుండి తీస్తారు. అలా గ్యాస్ తీయడం వల్ల మొక్కలకు లోపల నుండి అందాల్సిన ఆక్సిజన్ అందదు. దాని వల్ల చెట్లు పెరగవు. సుమారుగా ఒక రాష్ట్రానికి 54 లక్షల సిలిండర్లు అవసరమౌతాయంటే, ఇక దేశం మొత్తానికి ఎన్ని కావాలో లెక్క కట్టండి. గ్యాస్ సిలిండర్ ధర పెంచడం వల్ల, భారం మోయలేక చాలా మంది కట్టెలు కొట్టుకోవడానికి అడవికి వెళతారు. వారు అక్కడ శుభ్రమైన గాలి పీల్చుకుంటారు. దానివల్ల మేలు జరిగినట్టేకదా? వంట చెరకు కొట్టి తెచ్చుకుని కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటారు. కట్టెల పొయ్యి వల్ల పొగ వస్తుంది. ఆ పొగ వాతావరణంలో ఎక్కువ శాతంగా ఉన్న ఆక్సిజన్‌ను తగ్గిస్తుంది. అంటే, దానివల్ల వాతావరణ సమతుల్యం కాపాడబడుతుంది కదా? దానివల్ల మేలు జరిగినట్టే కదా? కట్టెల పొయ్యి మీద వంట చేసుకున్న మన పూర్వీకులు రోగాలు రొష్టులూ లేకుండా ఆరోగ్యంగా ఉండేవారు కదా? కట్టెల పొయ్యి ఉపయోగంలో లేనందువల్లనే ఈ రోజుల్లో రోగాలు నానాటికీ ఎక్కువవుతున్న విషయం అందరూ గ్రహించాలి! ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని, ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసమే మోడీ సిలిండర్ ధర పెంచారు. ఆయన ఏ పని చేసినా దేశం కోసం, ధర్మం కోసమే చేస్తారన్నది ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి''-ఫలానా పార్టీవారు చేస్తున్న ఈ ప్రచారంలో నిజానిజాలను దేశ ప్రజలే గ్రహించుకోవాలి! దేశం ఎంత ముందుకు పోతోందన్నది బేరీజు వేసుకోవాలి.
''దేశమును ప్రేమించుమన్న/మంచి అన్నది పెంచుమన్న'' - అన్న గురజాడ అప్పారావు మనకు తెలుసు. ''మతములన్నియు మాసిపోవును/జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును'' అన్నది కూడా ఆ మహానుభావుడే. ''చెట్ట పట్టాల్ పట్టుకొని దేశస్తులంతా నడవవలెనోరు/ అన్నదమ్ముల వలెను జాతులు/ మతము లన్నియు మెలగవలెనోరు''-అని ఆశించారా యన! అందుకు వ్యతిరేకమైన భావజాలాన్ని ఇప్పుడు ఒక గుజరాత్ అప్పారావ్ ద్వేషభక్తి గీతం పాడుతున్నాడు. కలం పేరుతో ఎవరో నాకు ఆ పేరడీ గేయం పంపించారు. అది నా పాఠకుల కోసం ఇక్కడ పొందుపరుస్తు న్నాను. ''మతమునే ప్రేమించుమన్న/ హింసయన్నది పెంచుమన్న/ వట్టి మాటలు చెప్పుకోవోరు/ చేయు మేలుని కట్టిపెట్టోరు/ దేశాభిమానమె నాకె కద్దని/ వట్టి గొప్పలె చెప్పుకోవోరు/ దేశమంటే జనం కాదోరు/ దేశమంటే మతంమయమోరు/హిందు మతమే రాజ్యమేలగ/దారిలో నువు పాటు పడవోరు/ తతిమ జాతులు మతములన్నీ/అణిగి మణిగి మెలగవలెనోరు/ స్వంతలాభమె అంతయనుకుని/ప్రజలనందరి ముంచవలెనోరు/జాతి ఆస్థులు కట్టగట్టి/ దత్తపుత్రుల కట్టబెట్టోరు/విజ్ఞానమంతయు రాతి యుగపు/ గ్రంథమయమని బొంకవలెనోరు/రోదసీ నౌకకి సైతం/దిష్టి టెంకారు కొట్టవలెనోరు/అంబేద్కరు గాంధీ ఇజాలకు/ పైపై డప్పు కొట్టవలెనోరు/మత సామరస్యం చావుకోసం/ లోన గోతులు తీయవలెనోరు''. అధికారంలో ఉన్నవారు పాడుతున్న ఈ ద్వేషభక్తి గేయం దేశానికి ఎంతగా గాయం చేస్తుందో... సామాన్య పౌరులు అర్థం చేసుకోవాలి! భారత దేశ సమగ్రతను కాపాడ దాం! విద్వేష భావాన్ని విడనాడుదాం!! ఇదే నేటి మన కర్తవ్యం.
/ వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త /
డా|| దేవరాజు మహారాజు