ప్రజాశక్తి-కలికిరి (అన్నమయ్యజిల్లా) : మాజీ మంత్రి స్వర్గీయ నల్లారి అమర్నాధ రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన 37వ వర్ధంతి సందర్భంగా ఉదయం నగిరిపల్లిలోని ఆయన సమాధి వద్దకు వెళ్లి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలికిరి మార్కెట్ యార్డ్ వద్ద వున్న ఆయన విగ్రహానికి పూలమాలు వేసి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నల్లారి అమరనాధ రెడ్డి పీలేరు నియోజక వర్గం నుండి ఎన్నో పర్యాయాలు గెలుపొంది ఎమ్మెల్యేగా, మార్కెటింగ్ గిడ్డంగుల శాఖ మంత్రిగా పనిచేసి ఆ శాఖలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారని, నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరు వయ్యారన్నారు. ఆయన సేవలు మరువ లేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు నిజాముద్దీన్ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు వాసనూరు చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ జనార్దన్ గౌడ్, మండల ఉపాధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, పీలేరు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అగస్తీశ్వర్, మండల ఎస్టీ సెల్ నాయకుడు శ్రీనివాస్ వర్మ తదితర టిడిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.










