- నగదు బదిలీ ద్వారా సబ్సిడీ చెల్లింపు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : వ్యవసాయ విద్యుత్ మీటర్లపై ప్రభుత్వం ముందుకు సాగేందుకే నిర్ణయించింది. దీనికోసం బ్యాంకులతో కూడా విస్తృతంగా చర్చలు జరిపింది. సంస్కరణలను అమలు చేస్తే అదనంగా 0.5 శాతం రుణం తీసుకునేందుకు అవకాశం కల్పిస్తూ కేంద్రం విద్యుత్ మీటర్లపై మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేంద్రం దీనిపై వెనకడుగు వేసినప్పటికీ రాష్ట్రం మాత్రం ముందుకే సాగాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల బ్యాంకులతో నిర్వహించిన ఒక సమావేశంలో ఇదే అంశంపై ఆర్థికశాఖ చర్చించినట్లు తెలిసింది. రైతులకు ఇవ్వాల్సిన విద్యుత్ సబ్సిడీ నిధులను బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయాలని నిర్ణయించిన రాష్ట్రం, అందుకు బ్యాంకర్లకు దిశా నిర్దేశం చేసింది. మొత్తం 11 బ్యాంకుల్లో రైతుల ఖాతాలకు సబ్సిడీ నిధులను జమ చేయాలని నిర్ణయించారు. దీనికోసం రెండు ఎస్క్రో ఖాతాలను ఏర్పాటుచేయనున్నారు. ఒకటి విడుదల చేసిన నిధుల వ్యయానికి సంబంధించి, రెండోది ఆపరేషన్స్‌కు సంబంధించి ఉంటాయి. ఈ మొత్తం విధానాన్ని పర్యవేక్షించే బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయాలు, విద్యుత్ శాఖలకు అప్పగించారు.










