Sep 12,2022 10:18
  • కోరుతున్న పలు రాష్ట్రాలు
  • ఎన్‌ఆర్‌ఆర్‌ఎ ప్రతిపాదన
  • సూత్రబద్దంగా అంగీకరించిన ఐఎండి

న్యూఢిల్లీ : వాతావరణ మార్పులు దేశ వ్యాప్తంగా వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావాన్ని చూప నున్నాయా? ఈ ప్రశ్నకు తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ప్రస్తుతమున్న వ్యవసాయ క్యాలెండర్‌ స్థానంలో నూతన క్యాలెండర్‌ను రూపొం దించాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయి. దీంతో దేశ వ్యాప్తగా వ్యవసాయ సీజన్‌ మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. నేషనల్‌ రెయిన్‌ఫెడ్‌ ఏరియా అథా రిటీ (ఎన్‌ఆర్‌ఆర్‌ఎ) ఈ దిశలో ఇప్పటికే ఒక ప్రతిపాదన చేసింది. ఇటీవల విడుదల చేసిన ఒక పత్రంలో దేశవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులను చర్చించిన ఆ సంస్థ 'నాట్లు వేయడంతో పంటల సాగుకు సంబంధించి అన్ని అంశాలకు వివిధ రాష్ట్రాల్లో స్థిరీకరించిన తేదీలను తప్పనిసరిగా సవరించాల్సి ఉంది.' అని పేర్కొంది. వ్యవసాయ క్యాలెండర్‌ మార్పునకు సంబంధించి కొన్ని సంవత్స రాలుగా చర్చ జరుగుతున్నప్పటికీ పెద్దగా స్పందించని ఇండియన్‌ మెట్రోలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌ (ఐఎండి) మొట్టమొదటిసారి ఈ ప్రతిపాదనను సూత్రబద్దంగా అంగీకరించినట్లు తెలిసింది. ఈ మేరకు 'డౌన్‌ టు ఎర్త్‌' తాజాగా ప్రచురించిన కథనంలో ప్రస్తుతమున్న స్థిర క్యాలెండర్‌ స్థానంలో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకోవడానికి వీలుగా ఉండే డైనమిక్‌ క్యాలెండర్‌ను జిల్లాలను యూనిట్‌గా చేసుకుని రూపొందించాలని ఆ సంస్థ భావిస్తోంది. ఐఎండి నుండి అందిన విజ్ఞప్తితో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చి (ఐసిఎఆర్‌), సెంట్రల్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డ్రైలాండ్‌ అగ్రికల్చర్‌ (సిఆర్‌ఐడిఎ)లు ఇప్పటికే ఈ అంశంపై దృష్టి సారించి 75 జిల్లాలకు డైనమిక్‌ క్యాలెండర్లను రూపొందించినట్లు సమాచారం. డైనమిక్‌ క్యాలెండర్‌కు బదులుగా తమ రాష్ట్రానికి నూతన వ్యవసాయ క్యాలెండర్‌ రూపొందించాలని అస్సాం అధికారికంగా కోరింది. దీంతో ఆ రాష్ట్ర పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఐసిఎఆర్‌ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ త్వరలోనే నివేదికను ఇవ్వనుంది. దీనిని పరిశీలించిన అనంతరం ఇతర రాష్ట్రాలలోనూ ఈ తరహా పరిశీలన చేయనున్నారు. బీహార్‌ కూడా ఇదే తరహా ప్రతిపాదన అందచేసినట్లు సమాచారం. మరోవైపు ప్రస్తుతం తప్పనిసరి పరిస్థితుల్లో రూపొందిస్తున్న కంటింజెన్సీ ప్రణాళికలను బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, జార్ఖాండ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జులైలో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆ రాష్ట్రాలు ఈ విషయాన్ని ప్రస్తావించి, వ్యవసాయ క్యాలెండర్‌కు సంబంధించి శాశ్వత పరిష్కారాన్ని చూపాలని కోరాయి.
 

ఇప్పుడే ఎందుకు...?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉపయోగిస్తున్న వ్యవసాయ క్యాలెండర్‌ను 1996లో ఐఎండి రూపొందించింది. జిల్లాల వారీగా ప్రతివారం కురిసే వర్షపాతం, ఉష్ణోగ్రత, పంటలసాగు తదితర వివరాలను ఈ క్యాలెండర్‌లో పొందుపరిచారు. దీని ఆధారంగా వ్యవసాయ శాఖ సూచనలు చేయడం ప్రారంభించింది. క్రమేణా ఇదే భారతదేశపు అధికారిక వ్యవసాయ క్యాలెండర్‌గా మారింది. అయితే, ఆ తరువాత వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అతి తక్కువ, అతి ఎక్కువ వర్షపాతాలు సాధారణ అంశాలుగా మారాయి. దీని ప్రభావం వ్యవసాయంపై తీవ్రంగా పడింది. డౌన్‌ టు ఎర్త్‌ చేసిన పరిశీలనలో 1988 నుండి 2018 వరకు దేశ వ్యాప్తంగా 420 జిల్లాల్లో జూన్‌ నెలలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దేశ వ్యాప్తంగా 730 జిల్లాలు ఉండగా 676 జిల్లాల్లో ఈ పరిశోధన సాగింది. 210 జిల్లాల్లో సాధారణం కన్నా అధిక వర్షం నమోదైంది. అయితే, ఈ పెరిగిన వర్షం వల్లకూడా రైతులకు నష్టమే జరిగింది. ఫలితంగా పంటల సాగులో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం ఖరీఫ్‌ ఆగస్టు నాటికి గత ఏడాదితో పోలిస్తే 3.76 మిలియన్‌ హెక్టార్లు తక్కువగా సాగైంది.