Sep 11,2022 07:42

తెలుగు సినీ నటి పూజిత పొన్నాడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండిస్టీలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'ఊపిరి' సినిమాతో పరిచయం అయినా ఈ నటి ఆ తర్వాత 'దర్శకుడు, రంగస్థలం, కల్కి' వంటి పలు చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాల్లో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ నటి ప్రస్తుతం 'ఆకాశ వీధుల్లో' అనే చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్న ఆసక్తికర విషయాలు..
తెలుగమ్మాయి అయినా తమిళమ్మాయి అయినా హీరోయిన్‌ అన్నాక అన్ని పాత్రలూ పోషించాలి. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో ప్రతి సినిమాకీ తమను తాము నిరూపించుకుంటూనే ఉండాలి. ఇక మన దగ్గర తెలుగమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వరని ఒక పెద్ద అపవాదు ఉంది. ఇందులో ఎవరికుండే కారణాలు వాళ్లకున్నాయి. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మనదగ్గర తెలుగమ్మాయిలకి అవకాశాలు మన దర్శక నిర్మాతలు ఇస్తున్న మాట మాత్రం వాస్తవం. అంతేకాదు తెలుగమ్మాయిలు సైలెంట్‌గా ఇండిస్టీలోకి దూసుకొస్తున్న సంగతీ తెలిసిందే. ఆ రకంగానే 'రంగస్థలం' ఫేం పూజిత పొన్నాడ వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ కెరియర్‌లో దూసుకుపోతున్నారు. లఘు చిత్రాలతో మొదలై... క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అవకాశాలు అందుకుంటున్నారు. ప్రస్తుతం వరుసగా పలు క్రేజీ సినిమాల్లో హీరోయిన్‌గానూ నటిస్తున్నారు.
కాగా పూజిత విషయానికొస్తే.. వైజాగ్‌ అమ్మాయి పూజిత పొన్నాడ. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయినా అనుకోని అవకాశంగా వచ్చిన షార్ట్‌ఫిల్మ్‌లో నటించి, విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు. ఆ వెంటనే సినిమాల్లో కూడా ఛాన్సులు వచ్చాయి. 'ఊపిరి'తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇందులో ఆమె చిన్న పాత్ర పోషించారు. ఆ తర్వాత 'రంగస్థలం'లో కనిపించారు. కాగా దర్శకుడు అనే చిత్రంతో సుకుమార్‌ బ్యానర్‌లో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. 'బ్రాండ్‌ బాబు', 'హ్యాపీ వెడ్డింగ్‌', 'మిస్‌ ఇండియా', 'కథ కంచికి మనం ఇంటికి', 'ఓదెల రైల్వేస్టేషన్‌' వంటి వరుస చిత్రాల్లో ఆమె నటించారు.
అందుకే అవకాశాలు...
'నేను తెలుగమ్మాయినే. కాలేజీ విద్యను చెన్నరులో పూర్తిచేశాను కాబట్టి తెలుగులానే తమిళం మాట్లాడతాను. ముందు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా కెరియర్‌ ప్రారంభించాను. ఆ తర్వాత షార్ట్‌ ఫిలింస్‌.. తర్వాత సినిమాల్లో క్యారెక్టర్స్‌... ఇప్పుడు హీరోయిన్‌గా వరుస అవకాశాలు వస్తున్నాయి. అలాగే అడపాదడపా వేరే సినిమాల్లో మంచి క్యారెక్టర్స్‌ ఉన్నా నటిస్తున్నా. చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి వెళ్లాలి.. హీరోయిన్‌ కావాలి అనే కోరికతో నేను రాలేదు. అవకాశం వచ్చింది వినియోగించుకున్నా. కానీ ఎందుకో తెలుగులో వచ్చే అవకాశాల కన్నా.. తమిళంలో ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయి. అంతే కాదు.. ''తెలుగు అమ్మాయి కావాలి'' అని దర్శకులు అనుకున్నారు కాబట్టే ''దర్శకుడు, రంగస్థలం, రాజుగాడు, హ్యాపీ వెడ్డింగ్‌, బ్రాండ్‌ బాబు, వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మి, సెవెన్‌, కల్కి'' వంటి సినిమాల్లోనూ నాకు అవకాశాలొచ్చాయి' అన్నారు పూజిత పొన్నాడ.
సమయం వచ్చినప్పుడు క్లారిటీ ఇవ్వాలి..
'సినీ ఇండిస్టీలో పెళ్లి కాకుండా ఫామ్‌లో ఉన్నటువంటి హీరోయిన్స్‌ పెళ్లి, కెరీర్‌ గురించి ఎన్నో రూమర్స్‌ వస్తూనే ఉంటాయి. అలాగని వచ్చిన ప్రతీ రూమర్‌పై హీరోయిన్స్‌ స్పందించడం సమయం వృథా చేసుకోవడమే.. కాకపోతే ఆ రూమర్స్‌ ప్రత్యక్షంగా, పరోక్షంగా పర్సనల్‌ లైఫ్‌పై క్రియేట్‌ చేస్తే మాత్రం కొన్నిసార్లు క్లారిటీ ఇవ్వక తప్పుదు' అన్నారు.
'ఆకాశ వీధుల్లో' ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ..'దేవిశ్రీ ప్రసాద్‌తో నేను రిలేషన్‌లో ఉన్నట్లు, మేమిద్దరం రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. నాపై ఈ రూమర్లు వచ్చిన సమయానికి నేను ఆయన్ని కలిసింది కూడా లేదు. చెన్నరులో ఉండగా వేదికలపై ఆయన పెర్‌ఫార్మెన్స్‌ చూడడం తప్ప, నేరుగా దేవిని కలవలేదు. ఆ రూమర్‌ వచ్చి వెళ్లిపోయిన ఆరు నెలలకు 'రంగస్థలం' వంద రోజుల వేడుకలో మొదటిసారి నేను ఆయన్ని కలిశా. మొదటసారి మాట్లాడింది కూడా అప్పుడే! అప్పటికే జనాల దృష్టిలో మా ఇద్దరి పెళ్లి కూడా అయిపోయింది. అసలు ఇలాంటి క్రేజీ గాసిప్స్‌ ఎలా క్రియేట్‌ చేస్తారో నాకు అర్థం కాదు. ఇలాంటి వాటిని పట్టించుకుంటే ఈ ఇండిస్టీలో ముందుకు సాగడం కష్టం' అని చెప్పుకొచ్చారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తనపై వచ్చిన రూమర్స్‌పై క్లారిటీ ఇస్తూనే తాను ఇంకా సింగిల్‌ అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కాగా తెలుగులో సుకుమార్‌.. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సినిమాలు చేయాలని ఆశపడుతున్నానని, వారి సినిమాల్లో ఛాన్స్‌ కోసం ఎదురుచూస్తున్నాని చెప్పారు.
పేరు : పూజిత పొన్నాడ
పుట్టిన తేదీ : అక్టోబర్‌ 5, 1989
పుట్టిన ప్రాంతం : విశాఖపట్నం
నివాస ప్రాంతం : హైదరాబాద్‌
చదువు : బి.టెక్‌
హాబీస్‌ : ట్రావెలింగ్‌, డాన్సింగ్‌

తల్లిదండ్రులు : రవి పొన్నాడ, సునీత పొన్నాడ