Sep 24,2023 07:39
  • మహాధర్నాకు వెళ్లవద్దంటూ నోటీసులు
  • బస్సులను అడ్డుకుంటున్న పోలీసులు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీలు తలపెట్టిన మహాధర్నాపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ కాండకు దిగింది. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు), ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ (ఎఐటియుసి), ఎపి ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) పిలుపు మేరకు సోమవారం ధర్నా జరగనుండగా శనివారం ఉదయం నుండే పోలీసులు నిర్బంధ చర్యలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో మహాధర్నాకు రావద్దంటూ నోటీసులు ఇస్తున్నారు. అంగన్‌వాడీల ఇళ్ల వద్దకు పోలీసులు వెళ్లి నోటీసుల ఇవ్వడం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. మహాధర్నాకు అనుమతి లేదని, అందువల్ల విజయవాడకు వెళ్లకూడదని నోటీసుల్లో పేర్కొంటున్నారు. ధర్నాకు వెళ్తున్నారా, లేదా అన్న దానితో సంబంధం లేకుండా అంగన్‌వాడీలుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ నోటీసులు ఇస్తున్నారు. అమలాపురం నుండి విజయవాడకు బస్సులో బయలుదేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న అంగన్‌వాడీలను అడ్డుకున్నారు. బస్సును వెనక్కి పంపేశారు. ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు కూడా వివిధ ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలిసింది. విజయవాడలో విలేకరుల సమావేశం నిర్వహించిన డిసిపి విశాల్‌ గన్నీ ఎన్‌టిఆర్‌ జిల్లా మొత్తం 144వ సెక్షన్‌ అమలులో ఉందని, ఎటువంటి ధర్నాలకు, ర్యాలీలకు అనుమతి లేదని చెప్పారు. బయట ప్రాంతాల వారు విజయవాడకు వచ్చి అల్లర్లు సృష్టించడానికి ప్రణాళిక వేసినట్లు తమ వద్ద సమాచారం ఉందని, అందువల్ల కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని అన్నారు. మరోవైపు ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు), ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ (ఎఐటియుసి), ఎపి ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) నాయకులు శనివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఆయా సంఘాల నాయకులు కె సుబ్బరావమ్మ, బేబీరాణి, జె లలిత, కె దుర్గ మాట్లాడుతూ అంగన్‌వాడీను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్లతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం సోమవారం మిగతా 6లో మహాధర్నాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికోసం విజయవాడ పోలీసు కమిషనర్‌, డిజిపిని అనుమతి కోరామన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రజాప్రతినిధుల దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లడానికి ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించాచు. అంగన్‌వాడీ వర్కర్లు, మినీవర్కర్లు, హెల్పర్లకు కనీస వేతనాలు చెల్లించేందుకు బడ్జెట్‌ కేటాయించాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వారికి గ్రాట్యూటీని అమలు చేయాలన్నారు. రాష్ట్రంలోని మినీ సెంటర్లను తక్షణమే మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని, టీచర్లకు ఇచ్చేంత వేతనాలు ఇవ్వాలని, మినీ వర్కర్లకు ప్రమోషన్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌తోపాటు వివిధ రకాల యాప్‌లను రద్దుచేసి ఒకే యాప్‌ ద్వారా విధులు నిర్వహించేలా చూడాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి రిటైర్మెంటు వయసును 62 ఏళ్లకు పెంచాలని, ఆఖరి వేతనంలో 50 శాతం పెన్షన్‌ ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ మెనూఛార్జీలు పెంచాలని, గ్రాస్‌ను ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న సెంటర్ల అద్దెలు, 2017 నుండి ఇప్పటి వరకూ టిఎ, డిఎ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. నాణ్యమైన సరుకులు లబ్ధిదారులకు సరిపోయేలా కచ్ఛితమైన కొలతతో ప్రతినెలా 5వ తేదీలోగా సకాలంలో అంగన్‌వాడీ సెంటర్లకు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మూడు సంఘాల ఆధ్వర్యాన విజయవాడలో ధర్నా చౌక్‌లో ధర్నా చేపడతామని తెలిపారు.

police-remand-anganwadi-workers

 

police-remand-anganwadi-workers

 

police-remand-anganwadi-workers

 

police-notice-to-chalo-vijayawada

 

e police-notice-to-chalo-vijayawada