చిత్ర పరిశ్రమలో ఒక్కో టైంలో ఒక్కో హీరోయిన్ హవా నడుస్తుంటుంది. ప్రస్తుతం ఆ వంతు నటి శ్రీలీలకు దక్కిందని చెప్పుకోవచ్చు. మొదటి సినిమా 'పెళ్లి సందడి'తోనే టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. క్రిటిక్స్ నుంచి ఈ చిత్రానికి మంచి ఆధరణే లభించింది. ఇక రెండో సినిమా అయిన 'ధమాకా'తో తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్గా దూసుకెళ్తోంది. క్రిస్మస్కి విడుదలైన ఈ చిత్రం భారీ సక్సెస్‌ను దక్కించుకుంది. దీంతో శ్రీలీల కోసం వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే అరడజను సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. అయితే ఓ వైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు సినిమాలు చేస్తూ బిజీ అవుతున్నారు. ఇక ధమాకా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె గురించిన మరిన్ని విశేషాలు.
.తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు కొట్టేస్తున్నారు నటి శ్రీలీల. చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా మారిపోయారు. దాదాపు ఆరు పెద్ద సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. తాజాగా మాస్ మహారాజా రవితేజ జోడీగా.. ధమాకా చిత్రంతో తెలుగులో సందడి చేస్తున్నారు. త్రినాథóరావు నక్కిన డైరెక్షన్లో తెరకెక్కిన ధమాకా ప్రమోషన్స్‌లో భాగంగా ఏ ఒక్క ఈవెంట్‌నూ వదలకుండా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.. 'మొదటి సినిమా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో అనేసరికి చాలా టెన్షన్ పడ్డాను. అలాగే రవితేజ గారి జోడిగా చేయాలనేసరికి అంతే టెన్షన్ పడ్డాను. ఆయన నా ఫేవరేట్ హీరో కావడం, అలాంటి ఆయన సరసన ఇంత త్వరగా ఛాన్స్ రావడం నాకు చాలా ఆనందాన్నీ .. ఆశ్చర్యాన్నీ కలిగించింది' అని చెప్పుకొచ్చారు.
పది నిమిషాలకే ఓకే చెప్పా!
''హలో గురూ ప్రేమకోసమే' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం త్రినాథరావు నన్ను సంప్రదించారు. అప్పుడే రచయిత ప్రసన్న కూడా పరిచయమయ్యారు. అయితే కొన్ని కారణాల వలన నేను ఆ పాత్రను చేయడం కుదరలేదు. ఆయన గుర్తుపెట్టుకుని మరీ ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు. పెళ్లి సందడి విడుదల కాకముందే 'ధమాకా' కథ వినిపించారు. కథ చెప్పిన పదినిమిషాలకే ప్రాజెక్ట్ ఓకే చేశాను. ఈ సినిమాలో నా పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది.. పైగా ఈ జానర్ సినిమాలంటే నాకూ ఇష్టమే. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనిపించింది' అని చెప్పుకొచ్చారు. వాస్తవానికి 2019లో కన్నడ చిత్రం 'కిస్' ద్వారా చిత్ర పరిశ్రమలో మొదట అడుగుపెట్టారు శ్రీలీల. ఆ తర్వాత 'భారతే' అనే మరో కన్నడ సినిమాలో నటించారు. ఆ తర్వాత తెలుగులో పరిచయమయ్యారు. అనతికాలంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అమ్మ సపోర్ట్‌తోనే..
'నేను ప్రస్తుతం ఎంబిబిఎస్ చదువుతు న్నాను. ఓ వైపు చదువుతూనే మరోవైపు సినిమాలు చేస్తున్నాను. కెరీర్, స్టడీ రెండూ బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను. ఇందుకు మా అమ్మ సపోర్ట్ చాలా ఉంది. మా అమ్మ కూడా డాక్టర్. అమ్మ ఎంబిబిఎస్ తర్వాత పెళ్లి చేసుకున్న పదేళ్లకు పిజి పూర్తిచేసింది. ఇప్పుడు డాక్టర్‌గా చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎంబిబిఎస్ చేస్తున్నాను. దాని తర్వాత ఏం చేయాలి అని ఇంకా డిసైడ్ చేసుకోలేదు. సినిమాలైతే చేతిలో చాలానే ఉన్నాయి' అని తెలిపారు.
'జింతాక్' నా ఫేవరెట్ సాంగ్!
'త్రినాథరావు దర్శకత్వం వహించిన 'నేను లోకల్'లో పాటలు బాగా వినేదాన్ని. అందులో కీర్తి సురేష్ చేసిన పాత్ర నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆయనతో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఇక ఈ చిత్రంలో 'జింతాక్' పాట బాగా నచ్చింది. ఇందులో నేను ప్రణవి పాత్రలో కనిపిస్తా. డ్యూయల్రోల్తో ట్రావెల్ అయినప్పుడు ఒక తికమక ఉంటుంది. ట్రైలర్లో చెప్పినట్లు ఇద్దరూ ఇష్టం అంటే.. ముగింపు ఎలా ఉంటుందనేది ఇందులో ట్విస్ట్ ఫ్యాక్టర్' అని చెప్పారు.
అదొక క్యూట్ మూమెంట్..
'స్పెయిన్‌లో జింతాక్ పాట షూట్ చేసినప్పుడు ఒకరోజు నా కాస్ట్యూమ్స్ బ్యాగ్ కనిపించకుండా పోయింది. చాలా టెన్షన్ పడ్డాను. అయితే మేము ఉండే లొకేషన్ నుంచి మూడు గంటలు ప్రయాణించి మా డీవోపీ, డైరెక్టర్ నా కోసం షాపింగ్ చేసి అక్కడ నుంచి ఫొటోలు పెట్టి ఓకే చేశారు. మా ఫ్యామిలీ మెంబర్స్ నా కోసం షాపింగ్ చేస్తున్నట్లు అనిపించింది. అదొక మంచి క్యూట్ మూమెంట్. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది' అని వివరించారు. 'ఒకవైపు నటిస్తూనే మరోవైపు మెడిసిన్ చదువుతున్నా. షూటింగ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు చదువుకుంటా. ఇక బాలకృష్ణ- అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ ఈ మధ్యే మొదలైంది. అలాగే బోయపాటి-రామ్ కాంబోలో ఒక మూవీ, వైష్ణవ్ తేజ్, నితిన్, వారాహి ప్రొడక్షన్లో ఇలా వేర్వేరు ప్రాజెక్టులకు ఓకే చెప్పా. ప్రస్తుతం ఇంకా కొన్ని కథలు వింటున్నా' అని తెలిపారు.
పేరు: శ్రీలీల
ఇతర పేర్లు: శ్రీ, లీల
పుట్టిన తేదీ: జులై 14, 2001
పుట్టిన ప్రాంతం: డెట్రాయిట్, అమెరికా
నివాస ప్రాంతం: బెంగళూరు, కర్ణాటక
చదువు: ఎంబిబిఎస్ చదువుతున్నారు
హాబీస్: డ్యాన్సింగ్, ట్రావెలింగ్, రీడింగ్
తల్లిదండ్రులు: సుభాకర్ రావు ఎస్. స్వర్ణలత
తోబుట్టువులు: శ్రీకర్, శ్రీదీప్