'సోషల్‌మీడియా అంటేనే పొగడ్తలతో పాటు విమర్శలుంటాయి. అందుకే వాటి గురించి నేనస్సలు పట్టించుకోను!' అంటున్నారు నటి కేతికాశర్మ. 'అయితే ఎవరైన నిర్మాణాత్మకంగా విమర్శలు చేస్తే మాత్రం స్వీకరిస్తాను. అంతిమంగా ప్రేక్షకుల్ని మెప్పించడమే నా కర్తవ్యంగా భావిస్తా. కథ నచ్చితే ఏ జోనర్ సినిమాలోనైనా నటించడానికి సిద్ధమే!' అని చెప్పుకొచ్చారు. తాజాగా వైష్ణవ్‌తేజ్ సరసన కథానాయికగా నటిస్తున్న చిత్రం 'రంగ రంగ వైభవంగా'. గిరీశాయ దర్శకుడు.
సెప్టెంబర్ 2న విడుదల సందర్భంగా కేతికాశర్మ పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లు..
'రొమాంటిక్' మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు నటి కేతికాశర్మ. ఆ తరువాత నాగశౌర్యతో కలిసి లక్ష్య స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో మెరిశారు. ఈ రెండు సినిమాలు గ్లామర్ రొమాంటిక్ జానర్‌కి చెందినవి. తాజాగా వైష్ణవ్ తేజ్‌తో కలిసి 'రంగరంగ వైభవంగా'లో నటించారు. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌ర్టైన్‌మెంట్ పిక్చర్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'ఇప్పటివరకూ చేసిన గ్లామర్ పాత్రలకు భిన్నంగా ఉంటుంది. 'ఖుషి' సినిమాలో భూమికను మళ్లీ గుర్తుచేస్తానంటున్నారు. ఇక పోతే తెలుగు పూర్తిగా అర్థమవుతోంది. కొంతవరకూ మాట్లాడగలుగుతున్నా. నా తొలి రెండు సినిమాల నుంచి 'రంగరంగ వైభవంగా' చిత్రానికి వచ్చేసరికి ఆశించిన స్థాయిలో భాషను నేర్చుకున్నా. త్వరలోనే పూర్తిస్థాయిలో నేర్చుకుంటా. ఎందుకంటే నటిగా నా తొలి ప్రాధాన్యం తెలుగు సినిమాలకే!' అని చెప్పారు.
ఫలితం గురించి ఆలోచించను..
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రేక్షకుల కామెంట్స్ కూడా చదువుతానని చెబుతున్నారు కేతిక. సినిమాల ఎంపికలో టాలీవుడ్‌కే మొదటి ప్రాధాన్యం ఇస్తానని, బయోపిక్ చిత్రాల్లో నటించాలనేది తన ముందున్న గోల్ అని చెప్పారు కేతిక శర్మ. 'అందరు నటీనటుల్లాగే నేనూ నా సినిమా బాగా రావాలి.. మంచి విజయాన్ని అందుకోవాలనే కోరుకుంటా. దానికోసం నూరు శాతం కష్టపడి పనిచేస్తా. కానీ ఫలితం నా చేతుల్లో ఉండదు కదా.. అందుకే నా నియంత్రణలో లేని దాని గురించి నేనెప్పుడూ ఆందోళన చెందను. ఓటీటీల మీద అంతగా ఆసక్తి లేదు. ప్రస్తుతం సినిమాల మీదనే దృష్టిపెడుతున్నా. సమాజానికి స్ఫూర్తినిచ్చే బయోపిక్ చిత్రాల్లో నటించాలన్నది నా కల. తెలుగులో కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఆ వివరాల్ని త్వరలో వెల్లడిస్తా!' అని చెప్పుకొచ్చారు.
మనసుకు నచ్చిందా.. లేదా?
'నేను తొలి అడుగులో 'రొమాంటిక్' లాంటి యూత్‌ఫుల్ సినిమా చేశా. 'లక్ష్య'తో స్పోర్ట్స్ డ్రామా టచ్ చేశా. మూడో ప్రయత్నంలో కుటుంబ ప్రేక్షకులకు చేరువయ్యే కథ చేయాలనుకున్నా. అలాంటి సమయంలోనే గిరీశాయ నాకీ కథ వినిపించారు. అన్ని వయసుల వారికీ నచ్చేలా ఉంటుంది. అందుకే ఈ కథ వినగానే చెయ్యాలని నిర్ణయించుకున్నా. ఆడియన్స్‌కు తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నా. సినిమా చూశాక.. రాధ లాంటి స్నేహితురాలు, ఆమెలాంటి చెల్లి, కూతురు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు'. అని చెప్పారు.
'నేను ప్రతి చిత్రాన్ని ఓ పాఠంలాగే భావిస్తా. మా అమ్మనాన్న ఇద్దరూ డాక్టర్లే. నన్నూ వైద్యురాలిని చేయాలనుకున్నారు. నాకేమో నటనపై ఆసక్తి ఎక్కువ. ఎప్పటికైనా వెండితెరపై కనిపించాలని కలలు కనేదాన్ని. ఇదే విషయాన్ని నా తల్లిదండ్రులకీ చెప్పా. వారు నా నిర్ణయాన్ని గౌరవించి.. ఆ దిశగా ప్రోత్సహించారు. 'రంగ రంగ వైభవంగా' సినిమాతో తెరపై డాక్టర్‌గా కనిపించబోతున్నా. నన్ను డాక్టర్‌గా చూడాలన్న మా అమ్మానాన్నల కోరికను ఇలా రీల్ లైఫ్‌లో నెరవేర్చా' అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
పేరు : కేతికాశర్మ
పుట్టిన తేదీ : డిసెంబర్ 24, 1995
పుట్టిన ప్రాంతం : న్యూఢిల్లీ
నివాస ప్రాంతం : ముంబై
వృత్తి : యాక్ట్రెస్, సింగర్, మోడల్, యూట్యూబర్
చదువు : గ్రాడ్యుయేషన్
హాబీస్ : ఎక్సర్‌సైజ్, ట్రావెలింగ్, షాపింగ్
తల్లిదండ్రులు: డాక్టర్ మనోజ్ శర్మ, నైనా శర్మ
తోబుట్టువులు : కొదీ శర్మ