-ఎసిబికోర్టు ఆదేశం
-క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
ప్రజాశక్తి - యంత్రాంగం:స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి జ్యూడిషియల్ రిమాండ్‌లో వున్న తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రెండు రోజుల పాటు సిఐడి కస్టడికి ఎసిబి కోర్టు అనుమతించింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నాం ఆదేశాలు జారీ చేసింది. ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సిఐడి కోరగా రెండు రోజుల విచారణకు న్యాయమూర్తి అనుమతించారు. రాజమహేంద్రవరం జైలులోనే బాబును విచారించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విచారణ అధికారుల పేర్లు ఇవ్వాలని, న్యాయవాదుల సమక్షంలో విచారణ చేయాలని ఆదేశించారు. ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణకు అనుమతించారు. విచారణ జరుపుతున్న విడియోలు, ఫోటోలు విడుదల చేయకూడదని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం కస్టడి ముగిసిన తరువాత వీడియో కాన్పరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరు పరచాలని ఆదేశించారు. అంతకుముందు బాబు రిమాండ్‌ను రెండు రోజుల పాటు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెలువడనుండటంతో కస్టడి పిటిషన్‌పై తీర్పును మధ్యాహ్నాం 2.30 గంటలకు ఎసిబికోర్టు న్యాయమూర్తి వాయిదా వేశారు. మధ్యాహ్నాం 1.30గంటల ప్రాంతంలో క్వాష్ పిటిషన్‌పై తీర్పును ప్రకటించిన హైకోర్టు న్యాయమూర్తి 'పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు' ఏకవాక్య తీర్పునిచ్చారు.అనంతరం కస్టడి పిటిషన్‌పై ఎసిబి కోర్టు తీర్పునిచ్చింది.
- ఈ దశలో జోక్యం చేసుకోలేం : హైకోర్టు
చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టేస్తూ జస్టిస్ కె.శ్రీనివాస్‌రెడ్డి జారీ చేసిన తుది ఉత్తర్వులలో వివిధ అంశాలను పేర్కొన్నారు. భజనాల్ కేసు నుంచి నిహారిక ఇన్ఫ్రా కేసు వరకు సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఈ దశలో పిటిషన్‌లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. కేసు దర్యాప్తు దశలో ఉండగా మినీ ట్రయిల్ చేసేందుకు ఆస్కారం లేదన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు 2021 డిసెంబర్ 09న నమోదు అయ్యిందని, దర్యాప్తు సంస్థ 140 మంది సాక్షులకుపైగా సీఐడీ విచారణ చేసిందని, నాలుగు వేలకు పైగా పత్రాలను దర్యాప్తు సంస్థ సేకరించిందని, ఇలాంటి ప్రాథమిక దశలో కోర్టుల జోక్యానికి ఆస్కారం లేదన్నారు. నిధుల దుర్వినియోగం వ్యవహారం తేలాల్సివుందని, దర్యాప్తు జరుగుతోందని గుర్తు చేశారు.
- అవి ఆరోపణలే : చంద్రబాబునాయుడు
జ్యుడిషియల్ రిమాండ్ శుక్రవారం ముగియడంతో చంద్రబాబును వర్చ్యువల్ పద్దతిలో శుక్రవారం ఉదయం ఎసిబి కోర్టు విచారించింది. ఈ సందర్భంగా సిఐడి కస్టడి కోరుతోందని, దీనిపై అభిప్రాయం తెలపాలని న్యాయమూర్తి కోరడంతో బాబు మాట్లాడుతూ తనపై ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమే అని తెలిపారు. తనకు కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా అన్యాయంగా అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు. జైలులో వుంచి తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని అన్నారు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయజీవితం తనదని పేర్కొన్నారు. ' నాతప్పు వుంటే విచారణ జరిపి అరెస్ట్ చేయాల్సింది. అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఇది నా బాధ. నా ఆవేదన . నా ఆక్రందన. ఈ వయస్సులో నాకు పెద్ద పనిష్మంట్ ఇచ్చారు. అయినా, చట్టం ముందు అందరూ సమానమేనని నమ్ముతాను. చట్టాన్ని గౌరవిస్తాను . న్యాయం గెలవాలి.' అని చంద్రబాబు న్యాయమూర్తికి తెలిపారు.










