Jan 29,2023 09:34

అనగనగా ఒక ఊరిలో భీమయ్య అనే రైతు ఉండేవాడు. అతను ఒకసారి ఎద్దుల్ని కొందామని సంతకు వెళ్ళాడు. తిరిగి వస్తుండగా చీకటి పడింది. అడవి దాటి వెళ్ళాలి. ఈ రాత్రివేళ అడవిలో నుండి ప్రయాణం చేయడం మంచిది కాదని, సమీపంలో ఉన్న గ్రామం వైపు నడక సాగించాడు.
ఆ గ్రామాన్ని చేరిన వెంటనే ఒక నూనెమిల్లు కనిపించింది. భీమయ్య ఎద్దుల్ని మిల్లు గోడకి ఉన్న ఇనుప కొక్కేనికి కట్టి, తానూ పక్కనే విశ్రమించాడు. భీమయ్య ఉదయాన్నే లేచి తన ఊరికి వెళ్ళిపోదామని ఎద్దుల్ని విప్పుతున్నాడు. అంతలో మిల్లు యజమాని వచ్చాడు అక్కడికి. అతనికి ఆ ఎద్దుల్ని కాజెయ్యాలనే దుర్బుద్ధి పుట్టింది.
వెంటనే-
'ఎవరు నువ్వు? నా ఎద్దుల్ని విప్పుతున్నావేం?' అని భీమయ్యని గదమాయించాడు. భీమయ్య బెదిరిపోయి 'ఈ ఎద్దులు నావి. వీటిని కొనుక్కొని వస్తుంటే చీకటి పడింది. రాత్రి ఇక్కడ తలదాచుకున్నాను. ఎద్దుల్ని ఇక్కడ కట్టి, నేనూ ఇక్కడే పడుకున్నాను' అని బదులిచ్చాడు.
'అదేం కాదు. ఈ ఎద్దులు నావి. ఈ నూనె మిల్లు వీటిని కన్నది. అందుకే అవి మిల్లుకు కట్టి ఉన్నాయి. నువ్వు చూడలేదా?' అని మరికాస్త దబాయించి అన్నాడు.
ఆ మాటలకు తెలివి తక్కువ భీమయ్య అచేతనుడైపోయాడు. చేసేదిలేక ఎద్దుల్ని వదిలేసి, ఏడ్చుకుంటూ ఇంటిముఖం పట్టాడు.
భీమయ్య కొంత దూరం వెళ్ళేసరికి ఒక కోతి ఎదురైంది. ఆ కోతి చాలా తెలివైనది.
కోతి భీమయ్యతో 'ఎందుకలా ఏడుస్తున్నావు? ఏమి జరిగింది?' అని ప్రశ్నించింది.
భీమయ్య తనకు వచ్చిన కష్టాన్ని కోతితో మొర పెట్టుకున్నాడు.
కోతి భీమయ్యతో 'నీకేం ఫరవాలేదు. నేనో చక్కని ఉపాయం చెబుతాను. నువ్వు వెంటనే గ్రామంలోకి వెళ్ళి కొంతమంది గ్రామస్తులను తీసుకుని రా!' అంది.
భీమయ్య మిల్లున్న గ్రామంవైపు వెనుతిరిగాడు. ఊరిలోకి వెళ్ళి కొంతమంది గ్రామస్తులను వెంటబెట్టుకుని, మిల్లు దగ్గరకు వచ్చాడు.
అక్కడ కోతి కూర్చుని ఉంది. మాట్లాడాలి రమ్మన్నావట ఏమిటని గ్రామస్తులు కోతిని అడిగారు. 'అవును. కానీ నాకు చిన్న పని ఉంది. వెంటనే వచ్చేస్తాను. అంతవరకు మీరిక్కడే ఉండండని' కోరింది. 'తొందరగా రా.. ఆలస్యం చేయకు' అన్నారు గ్రామస్తులు.
సూర్యుడు నడినెత్తికి వచ్చేశాడు. కోతి ఇంకా రాలేదు. అందరికీ కోపం వచ్చేస్తుంది. అదిగో.. అప్పుడు.. కోతి ఆయాసంతో వగరుస్తూ వారున్నచోటికి వచ్చింది.
'ఇంత ఆలస్యం ఎందుకు చేశావు? మా పనులన్నీ ఆపుకుని నీకోసం పడిగాపులు కాశాం' అని అందరూ కోపంగా అన్నారు.
అందుకా కోతి 'ఏం చెప్పను? నేను వస్తోంటే దగ్గరలో ఉన్న ఓ చెరువుకి నిప్పంటుకుంది. దానిలోని చేపలన్నీ కాలిపోతున్నాయి. ఆ మంటలు ఆరిపోయే వరకు ఉండి, మంటల్లో బాగా వేగిన చేపల్ని మస్తుగా తిని, నా ఆకలి తీర్చుకుని వచ్చేసరికి ఈ వేళయ్యింది' అన్నది.
దాని మాటలకు గ్రామస్తులతోపాటు మిల్లు యజమాని కూడా పగలబడి నవ్వసాగాడు.
'ఇదెక్కడి కథ?! విడ్డూరంగా ఉంది. చెరువుకి నిప్పంటుకోవడమేమిటి?' అనడిగారు.
'విడ్డూరమేముంది ఇందులో.. నూనె మిల్లు రెండు ఎద్దుల్ని కన్నప్పుడు, ఇలా ఎందుకు జరగకూడదు?' అంది కోతి. అంతా మౌనంగా, అయోమయంగా చూశారు. 'ఏంటి విషయం.. ఏం జరిగింది?' అని అడిగారు.
మిల్లు యజమాని భీమయ్యకు చేసిన మోసం గురించి చెప్పి 'ఇప్పుడు న్యాయం చెప్పండి పెద్దలారా?' అని అడిగింది కోతి.
గ్రామపెద్దలు మిల్లు యజమానికి చీవాట్లుపెట్టి, భీమయ్యతో ఎద్దుల్ని తీసుకుని పొమ్మని చెప్పారు. నూనెమిల్లు యజమాని అపరాధ భావంతో తల దించుకున్నాడు.
భీమయ్య కోతి తెలివిని మెచ్చుకుని, దానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎద్దుల్ని తోలుకుని, ఇంటి దారి పట్టాడు.

కంచనపల్లి ద్వారకనాథ్‌
9985295605