Apr 23,2023 10:12
  • నేడు యార్లగడ్డ రామనాథం సంస్మరణ సభ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తుది వరకూ కమ్యూనిస్టు ఉద్యమంతో నడిచి, కుటుంబాన్నీ ఆ దిశగా ప్రోత్సహించిన యార్లగడ్డ రామనాథం సంస్మరణ సభ నేడు. విజయవాడలోని సున్నపు బట్టీల సెంటర్‌ వద్ద గల అమ్మ కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం 11.30 గంటలకు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
        తను నమ్మిన సిద్ధాంతాన్ని కడవరకూ ఆచరించడమే కాకుండా కుటుంబం మొత్తాన్ని అదేబాటలో నడపటం అరుదైన విషయమే. కమ్యూనిస్టు సిద్ధాంతం గొప్పది, దాన్ని నమ్మితే అభివృద్ధే తప్ప వెనకడుగు ఉండదని కుటుంబ సభ్యులకు బోధించి ఆచరింపజేసి అదే బాటలో నడిపించిన అభ్యుదయ భావజాల బాటసారి యార్లగడ్డ రామనాథం. చివరి వరకూ తను నమ్మిక కమ్యూనిస్టు సిద్ధాంతానికి కట్టుబడి చివరికి తన భౌతికకాయం కూడా సమాజాభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో తమ ప్రాణాలు పోయిన తరువాత తనతోపాటు, తన భార్య భౌతికకాయాలను అభివృద్ధిపరమైన వైద్యశాస్త్ర ప్రయోగాలకు ఇవ్వాలని కోరిన గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి రామనాథం అనడంలో సందేహం లేదు. అంతకుముందే భార్య చనిపోయిన సమయంలోనూ ఆమె భౌతికకాయాన్ని కూడా వైద్య ప్రయోగాలకు స్వయంగా అప్పగించారు. కమ్యూనిస్టు పార్టీని నమ్మండి మంచి ఆలోచనలే వస్తాయి. నీతి నిజాయితీ ఉంటుంది అని కుటుంబ సభ్యులకు చెప్పి వారిని అదేబాటలో నడిపించారు. వ్యాపారంలోనూ నిజాయితీ ఉండాలని, నకిలీ వస్తువులు కొనుగోలుదారులకు అమ్మితే వారు నస్టపోతారని, కమ్యూనిస్టు భావజాలం దానికి పూర్తి విరుద్ధమని నమ్మి, ఆచరించి వ్యాపారంలోనూ అదేబాట నడిచారు. పిల్లలను నడిపించారు.
        యార్లగడ్డ రామనాథం 1934లో కృష్ణాజిల్లా గుడివాడ ప్రాంతంలోని పోలుకొండలో జన్మించారు. చిన్నతనం నుండి అభ్యుదయ భావజాలంతోనే ఉండేవారు. కస్తూరితో వివాహం అనంతరం ఆమెనూ కమ్యూనిస్టు భావజాలం వైపు నడిపించారు. యుక్తవయసులోనే తెలంగాణా సాయుధ పోరాటంలో అండర్‌ గ్రౌండ్‌లో ఉండిపనిచేసే నాయకులకు సహాయ సహకారాలు అందించేవారు. అగ్రనాయకులకు షెల్టర్‌ కల్పించడంతోపాటు వారికి భోజనం అందించడం, సమాచారాన్ని చేరవేయడం వంటి పనులు చేసేవారు. చల్లపల్లి జమిందారుకు వ్యతిరేకంగా జరిగిన భూపోరాటంలో తనవంతు పాత్ర పోషించారు. రామనాథం దంపతులకు నలుగురు పిల్లలు నిర్మల, సుబ్బారావు, వెంకటేశ్వరరావు (వైవి), వెంకటరమేష్‌. వారందరూ కమ్యూనిస్టు భావజాలంతోనే ఉద్యమంలో ఉన్నారు. నిర్మలకు వివాహమై హైదరాబాద్‌లో ఉంటున్నారు. అభ్యుదయ సాహిత్య అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. రెండో సంతానం సుబ్బారావు విజయవాడ పారిశ్రామిక రంగ, సేవా రంగ అభివృద్ధికి కృషిచేశారు. ఆటోనగర్‌ కో ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా అతిపెద్ద ప్రాజెక్టును పూర్తి చేయించారు. బాలోత్సవాలకు సంబంధించి నగరంలో చురుకుగా వ్యవహరిస్తూ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. మూడో సంతానమైన వై.వెంకటేశ్వరరావు ప్రస్తుతం సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా ఉన్నారు. అంతకుముందు విద్యార్థి ఉద్యమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర, జాతీయ నాయకులుగా బాధ్యతలు నిర్వహించారు. ఉద్యమ క్రమంలో జైలు జీవితం అనుభవించారు. నాలుగో సంతానం వెంకట రమేష్‌ విజయవాడలో తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ వ్యాపార రంగంలో ఉన్నారు. ఎవరు ఏ పనిలో ఉన్నా దాని వెనుక కమ్యూనిస్టు భావజాలం కచ్చితంగా ఆచరించాలని వారికి నేర్పించడంతో అదేబాటలో పయనిస్తున్నారు.
       చల్లపల్లి జమిందారీ పోరాటం అనంతరం రామనాథం కుటుంబం విజయవాడకు చేరుకుంది. ప్రస్తుత సీతారాంపురం పరిధిలో దుర్గాఅగ్రహారంలో అప్పటి సిపిఎం అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య నివాసం ఉన్న ప్రాంతంలో ఆయన ఇంటికి సమీపంలోనే రామనాథం కుటుంబం కూడా ఉండేది. కుటుంబ అవసరాల కోసం వ్యాపారం చేస్తున్నా కమ్యూనిస్టు భావాలను, ఆ పార్టీలో పనిచేయడాన్ని మాత్రం ఆపలేదు. కుటుంబ సభ్యులను కమ్యూనిస్టు పార్టీవైపు వెళ్లాలని ప్రోత్సహించేవారు. అందులో మనుషులు నిజాయితీగా ఉంటారనీ, ఆలోచనలూ సామాజిక అభ్యుదయ కోణంలో ఉంటాయని చెప్పి ప్రోత్సహించేవారు. అదే సమయంలో చదువులోనూ ముందుండాలని కోరేవారు. వ్యాపారంలోనూ అదే భావజాలంతో ఉంటే వినియోగదారులపట్ల గౌరవం ఉంటుందని, అప్పుడే మనసుకు ఎంతో కొంత తృప్తిగా ఉంటుందని బోధించేవారు. అటువంటి రామనాథం వయోభారంతో 89 సంవత్సరాల వయసులో ఈ నెల 15న తుదిశ్వాస విడిచారు. చివరిక్షణం వరకూ అదేబాటలో నడవడంతోపాటు తన శరీరాన్ని వైద్య పరిశోధనలకు పంపించాలని కోరిన ధన్యజీవి రామనాథం.