- 25న అంగన్‌వాడీల మహాధర్నా
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అంగన్‌వాడీల సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు) పేర్కొంది. విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం మూడు యూనియన్ల ప్రధాన నేతలు కె సుబ్బరావమ్మ, జె లలిత, విఆర్ జ్యోతి మీడియాతో మాట్లాడారు. మూడు యూనియన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 25న విజయవాడలో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 21 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్, మినీ వర్కర్స్, హెల్పర్స్ అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.26 వేలకు తగ్గకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివిధ రకాల యాప్‌లను రద్దు చేసి ఒకే యాప్ ద్వారా విధులు నిర్వహించేలా చేయాలని, తక్షణమే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీని రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలని, ఆఖరి వేతనంలో 50 శాతం పెన్షన్‌గా ఇవ్వాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. మినీ వర్కర్స్ అందరినీ తక్షణమే మెయిన్ వర్కర్స్‌గా గుర్తించాలని, నాణ్యమైన సరుకులు లబ్ధిదారులకు సరిపోయేంతగా కచ్ఛితమైన కొలతలతో ప్రతినెలా 5వ తేదీలోపు సెంటర్లకు అందజేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో జె హెల్డాజి, భారతి పాల్గొన్నారు.










