- ఉచితంగా అందించాలని భక్తుల వేడుకోలు
ప్రజాశక్తి - తిరుపతి ప్రతినిధి : దాహార్తి కోసం రూ.20 వెచ్చిస్తే లీటర్ వాటిల్ బాటిల్ వస్తుంది. అదే బస్టాండ్, సినిమాహాళ్లలో అయితే మరో రూ2-5 అదనంగా తీసుకుంటారు. కానీ తిరుమల కొండపై మాత్రం లీటర్ వాటర్ బాటిల్‌కు రూ.55 ఖర్చు చేయాల్సి వస్తోంది. తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం పేరుతో టిటిడి అధికారులు తీసుకున్న నిర్ణయంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. నీటి కోసమే ఓ కుటుంబం రూ.700-1000 వెచ్చించాల్సి వస్తోంది. 'జల ప్రసాదం' ఉచితంగా అందించాలని భక్తులు వేడుకుంటున్నారు.
శ్రీవారి ప్రసాదాలు తీసుకెళ్లే కవర్ల నుంచి స్థానికంగా విక్రయాలు జరిపే బొమ్మలు, బొరుగులు, కలకండ, గాజులు, చిప్స్ ప్యాకెట్లు, క్యారీబ్యాగులు అన్నీ ప్లాస్టిక్ మయమే. వీటిని నిరోధించడానికి టిటిడి కార్యాచరణ రూపొందించింది. మొదట దుకాణాల్లో ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించింది. వాటి స్థానంలో గుడ్డ కవర్లు, పేపర్ కవర్లను దుకాణదారులు, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో వినియోగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించింది.ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల స్థానంలో గాజు బాటిళ్లను ప్రత్యామ్నాయంగా చూసుకోవాలని టిటిడి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు
కొండపైకి గాజు వాటర్ బాటిళ్లను చేర్చేందుకు ముగ్గురు డీలర్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. తిరుపతిలోని వాటర్ ప్లాంట్ల నుంచి నీటిని సేకరించి...ఆ నీటిని బాటిళ్లలో నింపి కొండపైకి సప్లయి చేస్తున్నారు. అయితే ఎటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. బాటిళ్లలో బొద్దింక, పురుగులు వస్తున్నాయని, అధిక ధరకు బాటిళ్లను విక్రయిస్తున్నారని భక్తులు ఫిర్యాదు చేసినా టిటిడి అధికారులు పట్టించుకోవడం లేదు. 50-60 ప్రాంతాల్లో మాత్రమే తాగునీటి జలప్రసాద కేంద్రాలను ఏర్పాటు చేసింది. నిత్యం వేలమంది వచ్చే భక్తులకు అవి ఏ మాత్రం చాలడం లేదు.

వాటర్ బాటిళ్లకే రూ.700 : గణేషప్ప, కర్ణాటక
తిరుమలలో తాగునీటి కోసం మా కుటుంబానికి రూ.700 ఖర్చయ్యింది. ఒక్కో బాటిల్ ధర రూ.55 రూపాయలు. బాటిల్ తిరిగి ఇస్తే రూ.30 వెనక్కి ఇస్తారు. తిరుమలలో అన్నదాన సత్రంలో భోజనం, ఇతర హోటళ్లలో టిఫిన్‌కు కలిపి రూ. 300 అయ్యింది. వాటర్ బాటిళ్ల కోసం రూ. 700 అయ్యింది. ప్లాస్టిక్ నిషేధం పేరుతో తిరుమలలో యాత్రికుల జేబుకు చిల్లు పడుతోంది.

టిటిడి ఉచితంగా జలప్రసాదం ఇవ్వాలి : విశ్వనాధన్, ఈరోడ్, తమిళనాడు
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం ఉచితంగా భోజనం, ప్రసాదాలు అందిస్తోంది. అయితే జలప్రసాదాన్ని కూడా ఉచితంగా పంపిణీ చేయాలి. మేం తెచ్చుకున్న వాటర్ బాటిళ్లను అలిపిరి వద్దే విజిలెన్స్ అధికారులు తీసేసుకున్నారు. దీంతో గత్యంతరం లేక తిరుమలలో నీళ్లు కొనుక్కుని తాగాల్సి వచ్చింది.
సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం : శ్రీదేవి, టిటిడి హెల్త్ ఆఫీసర్
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం తప్పనిసరి. అలిపిరి చెకింగ్ పాయింట్ వద్దే నియంత్రణ చేస్తున్నాం పాలు, మజ్జిగ ప్యాకెట్ల నిషేధంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్లాస్టిక్ వినియోగిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తాం. షాంపు ప్యాకెట్లకు బదులుగా ప్రత్యామ్నాయంగా బాటిళ్లను తెచ్చుకోవచ్చు.










