Jun 27,2023 21:55

- అంగన్‌వాడీల పోరు యాత్రలో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు బేబిరాణి
ప్రజాశక్తి - గోకవరం(తూర్పుగోదావరి):అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు జి.బేబిరాణి హెచ్చరించారు. యూనియన్‌ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లాలో చేపట్టిన అంగన్‌వాడీల పోరుయాత్ర 2వ రోజైన మంగళవారం గోకవరం చేరుకుంది. ఈ సందర్భంగా గోకవరం దేవీచౌక్‌ సెంటర్‌ వద్ద నిర్వహించిన సభలో బేబిరాణి పాల్గని మాట్లాడారు. అంగన్‌వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయన్నారు. అందులో భాగంగానే నూతన విద్యా విధానం పేరుతో అంగన్‌వాడీ కేంద్రాలను పాఠశాలల్లో విలీనం చేస్తున్నారని, ఐసిడిఎస్‌కి బడ్జెట్‌లో నిధులు తగ్గిస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను జగన్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్‌లు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్‌గా అందించాలని కోరారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. యాప్‌ల పేరుతో పనిభారం పెంచడం సరికాదన్నారు. ఈ సమస్యలను పరిష్కరించకుంటే సర్కారుకు గుణపాఠం తప్పదన్నారు. ఈ యాత్రకు మద్దతుగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, జిల్లా అధ్యక్షులు ఎం.సుందరబాబు పాల్గన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్‌.మాణిక్యాంబ, కె.బేబిరాణి, జిల్లా ఉపాధ్యక్షులు అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.