అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :టిడిపి సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జెఆర్ పుష్పరాజ్ (65) పార్థీవ దేహానికి శుక్రవారం సాయంత్రం గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం నుదురుపాడు గ్రామంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ప్రభుత్వం తరుపున గుంటూరు ఆర్‌డిఒ ప్రభాకరరెడ్డి, ఎంఎల్‌ఎ ఉండవల్లి శ్రీదేవి హాజరు అయి పుష్పరాజ్ భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. అనారోగ్యంతో గుంటూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం సాయంత్రం మృతి చెందిన పుష్పరాజ్‌కు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అభిమానులు శుక్రవారం అంతిమ వీడ్కోలు పలికారు. గుంటూరు నుంచి నుదురుపాడు వరకు అంతిమ యాత్ర కొనసాగింది. అంతకు ముందు గుంటూరులోని ఆయన నివాసం వద్ద పుష్పరాజ్ పార్థీవ దేహానికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు నివాళులర్పించారు. అంత్యక్రియలకు చంద్రబాబు హాజరు అవుతారని ముందుగా పార్టీ నేతలకు సమాచారం వచ్చినా ఆయన గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నందు వల్ల రాలేకపోయారని పార్టీ వర్గాలు తెలిపాయి.










