Mar 16,2023 06:52
  •  ఎక్కువ శాతం సంక్షేమ పథకాలకే
  •  ఉదయం 8 గంటలకు కేబినెట్‌లో ఆమోదం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు సిద్ధమైంది. గురువారం ఉదయం 11 గంటలకు ఈ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేరద్రనాథ్‌రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. సుమారు రూ.2.96 లక్షల కోట్ల వరకు బడ్జెట్‌ ఉంటురదని అంచనా. ఇందులో ఎక్కువ శాతం రెవెన్యూ వ్యయానికే కేటాయింపులు జరుగుతాయని తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిపై పెరుగుతున్న ఆంక్షల నేపథ్యంలో ఈ బడ్జెట్‌ కొంత తగ్గి రూ.2.65 లక్షల కోట్లకు పరిమితమయ్యే అవకాశాలు కూడా ఉరటాయని పలువురు భావిస్తున్నారు. ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ఆమోదించనుంది.
2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌పైనే అంతా దృష్టి సారిస్తున్నారు. తరువాత ఏడాది బడ్జెట్‌ సమయానికి ప్రస్తుత ప్రభుత్వమే అధికారంలో ఉంటున్నప్పటికీ.. అది ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ విధానం కావడంతో నేటి బడ్జెట్టే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌గా చెప్పాలి. అందుకే తాజా బడ్జెట్‌ను ఎన్నికల బడ్జెట్‌గానే పరిగణించాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతి ఎన్నికల బడ్జెట్‌ సమయంలోనూ సంక్షేమ పథకాలకే పెద్దపీట వేస్తారు. అదే తరహాలో ఈ బడ్జెట్‌లో కూడా ఉన్నంత మేరకు సంక్షేమం, ఇతర పథకాలకే పెద్దపీట వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

  • రాజధానిపై ఎలా..?

ఇక విద్య, వైద్యం, ఇరిగేషన్‌, రాజధాని, పోలవరం వంటి వాటికి బడ్జెట్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిపై ఇంకా స్పష్టత లేకపోవడం, కోర్టులో వివాదం నడుస్తుండడంతో దానిని నిధులు కేటాయింపులు ఉండవన్న భావన వ్యక్తమవుతోంది. గవర్నరు ప్రసంగంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు రాకపోవడం తెలిసిందే. వైద్యానికి ఏకంగా రూ.20 వేల కోట్లకు పైగా నిధులు కోరుతుండగా, అంత కేటాయించే అవకాశాలు లేవని అంటున్నారు. పెట్టుబడి వ్యయంలో అత్యంత కీలకమైన నీటిపారుదల రంగంపైనా కొన్నేళ్లుగా నిధుల సమస్య వేధిస్తోంది. ఈ శాఖకు గత బడ్జెట్‌లో రూ.11,482 కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు రూ.5 వేలకోట్లు మాత్రమే ఖర్చు చేయడం చూస్తే ఈ ఏడాది కూడా కోతలు తప్పవన్న భావన వ్యక్తమవుతోంది. పోలవరానికి ఎంత కేటాయింపులు ఉంటాయన్నదానిపై అందరి దృష్టి ఉంది.