Sep 04,2022 08:28
  • రాష్ట్ర వాటాకు నాబార్డ్‌ రుణం : ప్రతిపాదన సిద్ధం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : జల్‌జీవన్‌ మిషన్‌ కింద రాష్ట్రంలో తాగునీటి పథకాల అమలుకు నాబార్డ్‌ నుంచి రుణం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం సంబంధిత నిర్వహణ సంస్థకు గ్యారంటీ ఇవ్వాలని కూడా నిర్ణయించారు. రాష్ట్రంలోని నీటి ఎద్దడి అధికంగా ఉన్న ప్రాంతాల్లో తాగునీటి పథకాల కోసం రూ.8,660 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో కేంద్ర వాటా నిధులు పోను రాష్ట్రం 4,020 కోట్లు భరించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని భరించే పరిస్థితి లేకపోవడంతో నాబార్డ్‌ నుంచి రుణం తీసుకోవాలని రాష్ట్ర తాగునీటి సరఫరా సంస్థ ప్రతిపాదించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా స్పందించడంతో సంస్థ అధికారులు నాబార్డ్‌కు రుణం కోసం లేఖ రాశారు. ఈ రుణాన్ని సకాలంలో తీర్చేందుకుగాను ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇస్తామని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ఆర్ధిక సంఘం నుంచి వచ్చిన నిధులను కూడా సక్రమంగా వినియోగించేందుకు కమిట్‌మెంట్‌ లెటర్‌ను కూడా నబార్డ్‌కు సమర్పిస్తామని తెలిపారు. పథకాలకు అవసరమైన రైల్వే, జాతీయ రహదారుల అథారిటీ, అటవీ, రెవెన్యూ, రోడ్లు భవనాల శాఖల అనుమతులు కూడా సాధ్యమైనంత త్వరగా తెచ్చుకుని పనులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.