నాల్గో టెస్ట్‌కు ముఖ్య అతిథులుగా
భారత, ఆస్ట్రేలియా ప్రధానుల రాక
అహ్మదాబాద్: గుజరాత్‌లోని నూతన హంగులతో నిర్మించిన నరేంద్ర మోడీ అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభమైన నాల్గో టెస్ట్‌కు ముఖ్య అతిథులుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ హాజరయ్యారు. 75ఏళ్ల ఇండో-ఆస్ట్రేలియా మైత్రి నేపథ్యంలో బిసిసిఐ ఆహ్వానం వీరు టెస్ట్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చారు. స్టేడియంకు చేరుకున్న వీరిని బిసిసిఐ అధికారులు సాదరంగా ఆహ్వానించి మైదానంలో ప్రత్యేకంగా సత్కరించారు. ఇరు దేశాల మధ్య 75ఏళ్ల స్నేహానికి గుర్తుగా బిసిసిఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ.. ఆసీస్ ప్రధానికి ప్రత్యేక మెమొంటోను అందజేశారు. బిసిసిఐ కార్యదర్శి జై షా.. భారత ప్రధాని మోడీకి జ్ఞాపికను ఇచ్చారు. మ్యాచ్‌కు ముందు భారత జట్టు సారథి రోహిత్ శర్మకు ప్రధాని మోడీ.. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు ఆ దేశ ప్రధాని ఆల్బనీస్ టెస్టు క్యాప్‌లు అందించారు. ఆ తర్వాత ఇరుదేశాల ప్రధానులు బంగారు పూత పూసిన గోల్ఫ్ కారులో మైదానమంతా తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం ఆటగాళ్లతో కలిసి జాతీయగీతాన్ని ఆలపించారు. టాస్ అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోడీ కామెంట్రీ బాక్స్‌లో కొంతసేపు గడిపారు. టెస్ట్ ప్రారంభమయ్యాక ఉభయ ప్రధానులు కొంతసేపు ప్రత్యేక గ్యాలరీలో కూర్చుని క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి రికార్డుస్థాయిలో లక్షా 30వేల సీట్ల సామర్థ్యం గల ఈ స్టేడియంలో ఓ అంతర్జాతీయ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి.










