హైదరాబాద్ : నీలోఫర్ ఆస్పత్రి నుంచి 6 నెలల బాబును ఓ మహిళ ఎత్తుకెళ్లిపోయిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది.
పూర్తి వివరాల్లోకెళితే .... గండిపేట క్రాస్ రోడ్డులోని ఓ ఫామ్‌హౌస్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న పైసల్‌ఖాన్ దంపతుల పెద్ద బాబుకు నిద్ర పట్టకపోవడంతో నిన్న మధ్యాహ్నం నాంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ బాబు చికిత్స పొందుతుండగా, రెండో బాబుతో కలిసి మొదటి అంతస్తు వార్డులో అతని తల్లి ఫరీదాభేగం కూర్చున్నారు. అక్కడ పసుపు కండువా కట్టుకుని క్రీమ్ కలర్ నైటీ వేసుకున్న ఓ మహిళ ఫరీదా బేగం వద్దకు వచ్చింది. తర్వాత ఫరీదా బేగంతో కలిసి వివిధ అంశాలపై మాట్లాడింది. అదే సమయంలో భోజనం వడ్డిస్తున్నామని చెప్పడంతో తల్లి ఫరీదాబేగం భోజనం చేసేందుకు వెళుతూ ... ఆ మహిళకు బాబును చూడమని చెప్పి వెళ్లిపోయింది. అప్పటి వరకు మాట్లాడిన మహిళ ఫోన్ చూపిస్తూ బాబును తీసుకెళ్లిపోయింది. తల్లి ఫరీదాబేగం భోజనం తీసుకొని తిరిగి వచ్చి చూసే లోపు ఆ మహిళతో పాటు బాబు ఎక్కడా కనిపించలేదు. అదే సమయంలో అక్కడే ఉన్న మరో మహిళ మీ బాబును ఆమె తీసుకుని వెళ్లిపోయిందని చెప్పడంతో... ఫరీదాభేగం ఆందోళన చెందింది. అయితే ఆమె మీ బంధువు అనుకున్నానని అందుకే ఆమె బాబును తీసుకుని వెళుతున్నా ఏమీ ప్రశ్నించలేకపోయానని అక్కడున్న మహిళ తెలిపింది. వెంటనే ఫరీదా ఆసుపత్రి సిబ్బందికి తెలియజేసింది. కానీ వారెవ్వరూ స్పందించకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు ఫరీదా ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మరోవైపు ఆస్పత్రిలోని సీసీ కెమెరాలు కూడా పనిచేయకపోవడంతో కేసు క్లిష్టంగా మారింది. తన బిడ్డను అప్పగించాలంటూ తల్లి ఫరీదా బేగం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. చిన్నారి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 16 గంటలు గడుస్తున్నా చిన్నారి ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బాబు కనిపించకపోవడంతో కన్నతల్లి రోదనలు మిన్నంటుతున్నాయి.










