Jun 13,2023 11:53

ప్రజాశక్తి-బి.కొత్తకోట (రాయచోటి-అన్నమయ్య) : గొర్రెల పాకపై కుక్కలు దాడి చేయడంతో 40 గొర్రెలు మృతి చెందిన సంఘటన తంబళ్లపల్లి నియోజకవర్గం, బి.కొత్తకోట మండలం, బడికాయలపల్లిలో మంగళవారం వేకువజామున చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బాధిత రైతు పసుపులేటి వెంకటరమణ మాట్లాడుతూ ... అర్ధరాత్రి ప్రాంతంలో తాను పోషించుకుంటున్న గొర్రెలను పాకలో ఉంచగా, సుమారు 40 గొర్రెలపై కుక్కలు విచక్షణారహితంగా దాడి చేశాయని, ఈ దాడిలో గొర్రెలు మఅతి చెందాయన్నారు. ఉదయం 6 గంటల సమయంలో తాను గమనించి వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోకపోవడంపై కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఈ విషయాన్ని సచివాలయం వెటర్నరీ అసిస్టెంట్‌ బాబా ఫక్రుద్దీన్‌కు తెలియజేయగా ఉన్నతాధికారులు చెబితే తప్ప తాము ఎక్కడికి వచ్చేది లేదని దురుసుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. సమయానికి పశు వైద్య అధికారులు స్పందించి ఉంటే గొర్రెలు కొన్ని అయినా బతికేవంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. చనిపోయిన గొర్రెల విలువ సుమారు రెండున్నర లక్షల వరకు ఉంటుందని, ప్రభుత్వం స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని రైతు వెంకటరమణ విజ్ఞప్తి చేశాడు. అయితే గొర్రెలపై దాడి చేసింది కుక్కలా లేక ఐనాల అనే అనుమానాన్ని గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు.