Aug 31,2023 07:51
  • రాష్ట్ర ఫిల్మ్‌, టివి, థియేటర్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోసాని

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : నంది నాటక అవార్డులకు ప్రభుత్వం నిర్ణయించిన ఐదు విభాగాల్లో తుది ప్రదర్శనకు 39 ఎంపిక చేశామని, ఎటువంటి విమర్శలకూ తావు లేకుండా ఈ ప్రక్రియ జరిగిందని, రాష్ట్ర ఫిల్మ్‌, టివి, థియేటర్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళి, ఎమ్‌డి టి విజయకుమార్‌రెడ్డి తెలిపారు. దీనిపై బుధవారం జ్యూరీ సభ్యులతో వారు సమావేశం అయ్యారు. పరిశీలనకు అనుమతించాల్సిన విధివిధానాలను, పారదర్శకంగా వ్యవహరించాల్సిన తీరును వివరించారు. అనంతరం దీనిపై కృష్ణమురళి మీడియాతో మాట్లాడారు. ఉత్తమ కళాకారులను ఎంపిక చేశామని తెలిపారు. ఎంతో అనుభవం ఉన్నవారిని న్యాయ నిర్ణేతలుగా ఎంపిక చేశామని పేర్కొన్నారు. పద్య నాటక న్యాయ నిర్ణేతలు సెప్టెంబరు ఎనిమిదో తేదీన కర్నూలు నుండి పర్యటన ప్రారంభించి 18వ తేదీన విశాఖపట్నంలో ముగిస్తారని వివరించారు. సాంఘిక, యుజన నాటిక విభాగం నిర్ణేతలు సెప్టెంబరు 10న పిఠాపురంలో బయలుదేరి, 18వ తేదీన కర్నూలులో పర్యటన ముగిస్తారని అన్నారు. సాంఘిక, బాలల నాటకాల నిర్ణేతలు సెప్టెంబరు 7న అనంతపురంలో బయలుదేరి, 18న విశాఖపట్నంలో ముగిస్తారని పేర్కొన్నారు. నాటక రంగ తెలుగు రచననలకు న్యాయ నిర్ణేతల్లో అప్పాజోస్యుల సత్యనారాయణ, గుమ్మా సాంబశివరావు, ఎన్‌వి కృష్ణారావు ఉన్నారని తెలిపారు. పద్య నాటక విభాగంలో కురుటి సత్యంనాయుడు, ఎం కుమార్‌బాబు, మొతుకపల్లి సూర్యనారాయణయాదవ్‌ ఉన్నారు. అలాగే సాంఘిక, యువజన నాటక విభాగంలో నిర్ణేతలుగా ఆకుల మల్లేశ్వరరావు, పి శివప్రసాద్‌, ఎస్‌ఆర్‌ఎస్‌ ప్రసాద్‌ను ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. అలాగే సాంఘిక, బాలల నాటిక విభాగానికి కెజి వేణు, దాసిరి నల్లన్న, పి సుమను న్యాయ నిర్ణేతలుగా నియమించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కళాకారులందరికీ గుర్తింపుకార్డులు జారీచేస్తామని ఆయన తెలిపారు. కళాకారుల వివరాలను ఎపిఎస్‌ఎఫ్‌టివిటిడిసి వెబ్‌సైట్లో ఉంచుతామని అన్నారు. ఏజెంట్లకు ఎటువంటి కమీషన్లు చెల్లించాల్సిన అవసరం లేదని పోసాని తెలిపారు.