Nov 30,2022 21:23

పోడియం ముందు నిరసన తెలుపుతున్న టిడిపి కౌన్సిలర్లు

         హిందూపురం : మూడు నిమిషాలు... హిందూపురం మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహణకు కేటాయించిన సమయం ఇది. అజెండాలో 35 అంశాలను ఉంచినా వాటిపై కనీస చర్చ జరపకుండా మూడు నిమిషాల్లో సమావేశాన్ని మమ అనిపించారు. పట్టణంలో అభివృద్ధి సక్రమంగా జరగడం లేదంటూ ప్రతిపక్ష టిడిపితో పాటు అధికార వైసిపి కౌన్సిలర్లు సైతం సమావేశంలో విమర్శలు చేయడం గమనార్హం. హిందూపురం మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధరణ సమావేశం బుధవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ఛైర్‌పర్సన్‌ డిఎన్‌.ఇంద్రజ అధ్యక్షతన నిర్వహించారు. పట్టాణాభివృద్ధికి సంబంధించి అధికారులు 35 అంశాలతో కూడిన అజెండాను కౌన్సిల్‌ దృష్టికి తీసుకొచ్చారు. మున్సిపల్‌ సమావేశం జరిగే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 4వ విడత జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని పట్టణంలోని బాలయేసు కళాశాలలో చేపట్టారు. ఇందులో కౌన్సిలర్లు అందరూ పాల్గొనాలని ఛైర్‌పర్సన్‌ సమావేశంలో వారిని ఆహ్వానించారు. ఇందుకోసం మున్సిపల్‌ అజెండాలోని అంశాలతో పాటు టేబల్‌ అజెండాను అందరి సభ్యుల కోరిక మేరకు అమోదిస్తున్నట్లు వైసిపి కౌన్సిలర్లు లేచి నిలబడి ఆమోదం తెలిపారు. దీనిపై టిడిపి కౌన్సిలర్లతో వైసిపి అసమ్మతి కౌన్సిలర్లు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. టేబుల్‌ అజెండాను ఇవ్వకుండానే ఎలా అమోదిస్తారని ఛైర్‌పర్సన్‌తో వాగ్వాదం చేశారు. దీంతో టేబుల్‌ అజెండాను తిరస్కరిస్తున్నట్లు ఛైర్‌పర్సన్‌ ప్రకటించారు. ఇది జరుగుతున్న సందర్బంలోనే అధికార పార్టీకి చెందిన 5వ వార్డు కౌన్సిలర్‌ ఇర్షాద్‌ అభివృద్ధి విషయంలో తన వార్డుకు అన్యాయం జరుగుతోందని, కౌన్సిలర్‌లకు అధికారులు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఛైర్‌పర్సన్‌ పోడియం ముందు కూర్చొని నిరసన తెలిపారు. అధికార పార్టీకి చెందిన 20వ వార్డు కౌన్సిలర్‌ పరుశురాం తన వార్డును ఎస్టీకి రిజర్వు చేశారని, అయితే రెండు సంవత్సరాలు కావాస్తున్నప్పటికీ ఇంత వరకు ఒక్క రూపాయి అభివృద్ధి కూడా తన వార్డులో చేపట్టలేని ఛైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకెళ్లారు. వార్డులో తనకు కనీస విలువ లేదని, ఈ నేపథ్యంలో తాను కౌన్సిలర్‌గా ఉండలేనంటూ రాజీనామ పత్రాన్ని ఛైర్‌పర్సన్‌కు ఇచ్చారు. మరో వైసిపి కౌన్సిలర్‌ శివ సైతం అజెండాలోని అంశాలపై కనీస చర్చ లేకుండా ఎలా అమోదిస్తారని నిలదీశారు. అజెండాలో తప్పుడు అంశాలు పెట్టడం వల్లే చర్చ లేకుండా ఇలా అమోదిస్తున్నారని ఆరోపించారు. మరికొందరు వైసిపి కౌన్సిలర్లు సైతం అజెండా ఆమోదంపై అభ్యంతరం తెలిపారు. సమావేశంలో కౌన్సిలర్లు నిరసన తెలుపుతుండగానే ఛైర్‌పర్సన్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో కొందరు కౌన్సిలర్లు ఛైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొంతసేపటికి వారు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రజా సమస్యలపై చర్చ జరిపి పట్టాణాభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాల్సిన మున్సిపల్‌ సమావేశం ఇలా మూడు నిమిషాల్లో మమ అనిపించడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.