- ముఖ్యమంత్రులు మారుతున్నా రెగ్యులర్ కావట్లేదు
ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : ముఖ్యమంత్రులు మారు తున్నా, దశాబ్దాలు గడుస్తున్నా గురుకుల పాఠశాలల్లోని కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్ కల మాత్రం నెరవేరడం లేదు. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగానే కొనసాగాల్సి వస్తోంది. అధికారులకు, కేబినెట్ సబ్ కమిటీ సభ్యులకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి విన్నవించినా వారిని రెగ్యులరైజ్ చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎపి రెసిడెన్షియల్ పాఠశాలలు (ఎపిఆర్‌ఎస్), 32 మహాత్మా జ్యోతీబా ఫూలే బిసి రెసిడెన్షియల్ పాఠశాలలు (ఎంజెపిబిసిఆర్‌ఎస్) ఉన్నాయి. ఎపిఆర్‌ఎస్ పాఠశాలల్లో 143 మంది, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 21 మంది, ఎంజెపిబిసిఆర్‌ఎస్‌లలో 63 మంది మొత్తం 227 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారంతా 2,000, 2,001, 2,003, 2,005, 2,007ల్లో పేపర్ నోటిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్, మెరిట్ ద్వారా నియమితులైన వారే. తమను రెగ్యులరైజ్ చేయాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డికి వారు విన్నవించడంతో గురుకుల ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ ప్రారంభించారు.

సాంఘిక సంక్షేమ పాఠశాలల ఉపాధ్యాయులను క్రమబద్ధీకరిస్తూ జిఒ 59ని జారీ చేశారు. ఆయన మరణంతో తరువాత సిఎం అయిన రోశయ్య ఎమ్మెల్సీ కమిటీని నియమించారు. ఆ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం లభించిన కొద్ది రోజులకే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి సిఎం అయ్యాకా గురుకుల కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణకు అంగీకరిస్తూ సంతకం చేశారు. రాష్ట్ర విభజనతో అది కూడా మరుగున పడిపోయింది. విభజన అనంతరం చంద్రబాబు సిఎం అయ్యాకా క్రమబద్ధీకరణ చేస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు పాదయాత్ర చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఆదే హామీ ఇచ్చారు. జగన్ సిఎం అయ్యాకా స్పందనల్లో, సబ్ కమిటీ సభ్యులకు గురుకుల పాఠశాలల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు విన్నవించారు. కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు స్వయంగా ఆయన దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. అప్పుడు కూడా న్యాయం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీలన్నీ నీటి మూటలు గానే మిగిలిపోయాయి. ప్రభుత్వం తాజాగా పది వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెబుతున్నా, ఆ జాబితాలో వారికి స్థానం దక్కలేదు. 12 నెలల వేతనం కూడా అమలు కాలేదు. దీనికి సంబంధించిన ఫైల్ అన్ని శాఖల ఆమోదం పొందినా ప్రభుత్వం అడుగు ముందుకేయడం లేదు. రెగ్యులరైజ్ కాకపోవడంతో ఈ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డు కూడా వర్తించడం లేదు. ముఖ్యమంత్రులు మారుతున్నా తమను పట్టించుకోకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెగ్యులరైజ్ చేయాలి
దాదాపు 15 నుంచి 18 ఏళ్లుగా పనిచేస్తున్న మాకు జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేసి న్యాయం చేయాలి. పది రోజుల విరామంతో 12 నెలల వేతనాన్ని అందించాలి.
- డి హమీద్, కాంట్రాక్ట్ గురుకుల ఉపాధ్యాయుల కన్వీనర్










