Jul 08,2021 21:38

ముంబయి : 22 ఏళ్ల పోరాటం తరువాత ముంబయిలోని 580 మంది పారిశుధ్య కార్మికులకు భారీ విజయం లభించింది. ఈ కార్మికులందరికీ శాశ్వత ఉద్యోగులుగా హోదా ఇవ్వాలని మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ గ్రేటర్‌ ముంబయి(ఎంసిజిఎం)కు ఇండిస్టియల్‌ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. 1999లో 580 మంది కార్మికులను ఒప్పంద పనికి 'వాలంటీర్‌'గా విధుల్లోకి తీసుకున్నారు. తమని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని కార్మికులు అప్పటి నుంచి పోరాడుతున్నారు. వారిలో 54 మంది మరణించారు. 1999లో కేసు నమోదైనప్పటి నుంచి ఎంసిజిఎం వీరు తమ ఉద్యోగులు కాదని, పారిశుధ్య విభాగంలో వాలంటీర్లుగా పని చేస్తున్నారని చెబుతూ వస్తోంది. వారు జీతానికి అర్హులు కాదంటూ పారితోషకం చెల్లిస్తోంది. 'కౌన్సిల్‌ తమకు పారిశుధ్య కార్మికులు కావాలనే అప్పట్లో ప్రకటన ఇచ్చింది. పారిశుధ్య కార్మికుల మాదిరిగానే వీరు కూడా పనులు చేస్తున్నారు. వీరిని కూడా శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి' అని కచారా వాహతుక్‌ శ్రామిక్‌ సంఘ్  అధ్యక్షులు దీపక్‌ భలేరావు కోర్టులో తన వాదనలు వినిపించారు. ఒక కార్మికున్ని శాశ్వత ఉద్యోగిగా ప్రకటించాలంటే ఏడాదిలో వరసగా 240కు పైగా రోజుల్లో పని చేయాలి. ఈ నిబంధనను అడ్డంపెట్టుకుని ఎంసిజిఎం పారిశుధ్య పనిని వివిధ సోషల్‌ సంస్థలకు టెండర్‌ విధానంలో అప్పగించింది. ఈ కార్మికులకు ఏడాదిలో ఏడు నెలలు (220 రోజులు) మాత్రమే పని కల్పించేది. ఈ విషయాన్ని కూడా కార్మిక సంఘాలు కోర్టులో నిరూపించాయి. చివరికి కార్మికులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. 5,875 మంది కార్మికులతో సంబంధం ఉన్న మూడు కేసులు ఇంకా కోర్టులో పెండింగ్‌ ఉన్నాయి.