ప్రజాశక్తి - గంపలగూడెం: గంపలగూడెం - వినగడప గ్రామాల మధ్య గల కట్టలేరు వంతెన 2018లో వచ్చిన వరదలకు దెబ్బతిన్న విషయం తెలిసిందే. అప్పటినుండి అప్పటి ప్రభుత్వ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఇప్పటి తిరువూరు ఎమ్మెల్యే, నాయకులు, వంతెన నిర్మాణానికి చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నిధులు మంజూరు అయిన దాఖలాలు లేవు. ఈ వంతెన దెబ్బతినడంతో తెలుగు రాష్ట్రాల కలుపుతున్న పలు గ్రామాల ప్రజలు నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులు, ప్రముఖ నాయకులు, మాజీ ఎంపీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, చొరవతో 19 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలుస్తోంది. మండలంలో అధికార పార్టీకి చెందిన ఓ సాధారణ నాయకుడు సుధాకర్ రెడ్డి దృష్టికి తీసుకు పోగా ఈ నిధుల మంజూరుకు అవకాశం కలిగినట్లు తెలుస్తోంది. ఇటీవల సుధాకర్ రెడ్డితో పాటు స్థానిక నాయకుడు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి జగన్ మోహన్ రెడ్డితో ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిసింది. స్పందించిన సీఎం వెంటనే రోడ్లు భవనాల ముఖ్య కార్యదర్శిని పిలిపించి వంతెన నిర్మాణానికి అవసరమైన పైన నిధులు విడుదల చేయాలని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. దీనితో నాలుగేళ్లుగా వెంటాడుతున్న ప్రజల కష్టాలకు తెర పడనున్నట్లు సమాచారం.










