Sep 13,2023 09:54
  • నిబంధనలన సవరణకు ఎపిఇఆర్‌సికి డిస్కమ్‌ల ప్రతిపాదనలు
  • సిపిఎం తరుపున బాబూరావు అభ్యంతరాల సమర్పణ
  • నేడు విచారణ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వడ్డీ పేరుతో మరో రూ.1500 కోట్లు రాష్ట్ర ప్రజలపై భారం మోపేందుకు విద్యుత్‌శాఖ సిద్ధమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం విద్యుత్‌ నియంత్రణ మండలికి సిపిఎం తరుపున అభ్యంతరాలతో కూడిన లేఖ సమర్పించారు. దీన్ని మీడియాకు విడుదల చేశారు. ప్రభుత్వ తప్పులకు ప్రజలను బాధ్యులను చేసి భారం మోపడం తగదని పేర్కొన్నారు. విద్యుత్‌ పంపిణీ సంస్థల ప్రతిపాదనలను తిరస్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళన తప్పదని హెచ్చరించారు.
             ఆంధ్రప్రదేశ్‌ తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ ఎపిఇఆర్‌సి క్లాజ్‌ 11, 15(4)లో సవరణలు చేయాలని కోరుతూ నియంత్రణ మండలిని కోరిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు సకాలంలో చెల్లించకపోవడం, ప్రభుత్వ సంస్థలు కార్యాలయాలు, విద్యుత్‌ బిల్లులు చెల్లించకపోవడం, వివిధ ప్రైవేటు బడా సంస్థలు, వ్యక్తులు బిల్లులు చెల్లించక పోవడంతో పంపిణీ సంస్థలకు నష్టం వస్తోందని, దీన్ని వినియోగదారుల నుండి వసూలు చేయడానికి వీలుగా నిబంధనల్లో సవరణలు చేయాలని కోరారని పేర్కొన్నారు. దీనిపై బుధవారం హైదరాబాద్‌లో విచారణ జరగనుందని వివరించారు.
           2022-23 సంవత్సరంలో తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ 625 కోట్లను వడ్డీ కోసం ఖర్చు పెట్టిందని, మూడు పంపిణీ సంస్థలు కలిపి రూ.1500 కోట్లు ఖరు ్చ చేస్తున్నట్లు అంచనాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఈ అప్పుడు, వడ్డీలు పెరుగుతాయని తెలిపారు. ఈ అప్పులతో, వడ్డీలతో ప్రజలకు సంబంధం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాల నుండి విద్యుత్‌ ఛార్జీల పెంపు, స్లాబులు మార్చి భారాలు మోపడం, విద్యుత్‌ సుంకం పెంచడం, ట్రూఅప్‌, సర్దుబాటు ఛార్జీల పేరుతో భారాలు మోపుతున్నారని తెలిపారు. అదనపు వసూళ్ల ద్వారా ప్రజలపై వేలకోట్ల రూపాయల భారం వేస్తున్నారని విమర్శించారు. బిల్లులు చెల్లించలేక ప్రజలు గగ్గోలు పెడుతున్నారని, వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, పరిశ్రమలు మూతపడుతున్నాయని, ఉపాధి దెబ్బతింటోందని తెలిపారు. ప్రతినెలా జమా ఖర్చులపై విచారణ లేకుండానే యూనిట్‌కు అదనంగా రూ.0.40 పైసలు చొప్పున సర్దుబాటు చార్జీలు వసూలు చేయడం దారుణమని పేర్కొన్నారు. వ్యవసాయం, ఇతర కేటగిరీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌కు ప్రభుత్వం సబ్సిడీని చెల్లించాలని, కానీ చెల్లించడం లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభ్తువం అనుసరిస్తున్నవన్నీ తప్పుడు విధానాలేనని పేర్కొన్నారు. వినియోగదారుల నుండి కనెక్షన్లు తీసుకున్నప్పుడే మూడు నెలల డిపాజిట్లు వసూలు చేస్తున్నారని, బిల్లులు పెంచి, బిల్లులు పెరిగాయనే సాకుతో అదనపు డిపాజిట్లు ఎప్పటికప్పుడు బలవంతంగా వసూలు చేస్తున్నారని తెలిపారు. అదనపు లోడ్‌ పేరుతో సెక్యూరిటీ డిపాజిట్లు గుంజుతున్నారని పేర్కొన్నారు. 15 రోజుల్లో బిల్లు చెల్లించకపోతే డిలే పేమెంట్‌ సర్‌ఛార్జి కూడా వసూలు చేస్తున్నారని వివరించారు. సాధారణ వినియోగదారులు నెలరోజుల్లో విద్యుత్‌ బిల్లులు చెల్లించకపోతే వారి కనెక్షన్లు తొలగించి తిరిగి రీ కనెక్షన్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. ఆలస్యమైన బిల్లుకు వడ్డీ కూడా కట్టించుకుంటున్నారని, ఇలా వినియోగదారుల నుండి వసూలు చేసిన కోట్లాది రూపాయలు పంపిణీ సంస్థల వద్ద ఉంటున్నదని వివరించారు. విద్యుత్‌ నియంత్రణ మండలి ప్రభుత్వం నుండి బకాయిలు వసూలు చేయడానికి ఆదేశాలు ఇవ్వాలని, ఆలస్యం అయితే వడ్డీ కూడా ప్రభుత్వ నుండి వసూలు చేయాలని తెలిపారు. వినియోగదారులపై వడ్డీ భారం వేసే ప్రతిపాదనలను తిరస్కరించాలని కోరారు. పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. బహిరంగ విచారణ హైదరాబాద్‌లో కాకుండా అమరావతిలో జరపాలని కోరారు. అన్ని ప్రాంతాల వారు పాల్గొనేందుకు వీలుగా ఆన్‌లైన్లో జరపాలని కోరారు. ఈ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా సిపిఎం ప్రజలను చైతన్య పరుస్తుందని, ఉద్యమాలు చేపడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే విధిస్తున్న సర్దుబాటు చార్జీల భారాలను రద్దు చేయాలని కోరారు. స్మార్ట్‌ మీటర్ల పేరుతో వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతూ బడా కంపెనీలకు మేల చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను తిప్పి కొట్టాలని కోరారు.