- ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు, స్మార్ట్‌మీటర్లకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐక్య ఉద్యమం నిర్వహించనున్నట్లు పట్టణ పౌర సంఘాల సమాఖ్య కన్వీనరు సిహెచ్ బాబూరావు తెలిపారు. సమాఖ్య రాష్ట్ర సమావేశం మంగళవారం వై వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఆన్‌లైన్‌లో జరిగింది. ఈ సందర్భంగా కన్వీనరు బాబూరావు నివేదికను ప్రవేశపెట్టారు. పట్టణ ప్రజలపై విద్యుత్ భారం తీవ్రంగా ఉందని తెలిపారు. సర్దుబాటు ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీలు, సర్‌ఛార్జీలు, అదనపు లోడ్ డిపాజిట్లు, అదనపు కస్టమర్ ఛార్జీలు వివిధ రూపాల్లో ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. స్మార్ట్ మీటర్ల వల్ల కార్పొరేట్ కంపెనీలకు తప్ప ప్రజలకు ప్రయోజనం ఏమీలేదని, భారం పడుతుందని, చిరువ్యాపారుల నుండి చిన్న పరిశ్రమల వరకూ ప్రతిఒక్కరూ బాధితులేనని తెలిపారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా అన్ని పట్టణాల్లో వర్తక, వాణిజ్య సంఘాలు, కాలనీ అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు, పౌర సంఘాలతో కలిసి జూన్ 30న రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఐక్యవేదికలు ఏర్పాటుచేసి క్షేత్రస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ వేర్వేరు రూపాల్లో ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మరోసారి ఇంటి పన్నులు 15 శాతం పెంచడం దారుణమని, ఇది వరుసగా మూడో ఏడాది పెంపుదలని తెలిపారు. మరోవైపు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల కోసం భూముల విలువను పెంచిందని, దీనివల్ల ఆస్తి విలువ పెరిగి ఇంటి పన్నులు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం యూజర్ ఛార్జీలు వసూలు వేగవంతం చేసిందని, ప్రజలను బెదిరించి మరీ చెత్తపన్ను వసూలు చేస్తున్నారని విమర్శించారు. పారిశుధ్య నిర్వహణ, ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం, స్థానిక సంస్థలు చెత్త పన్ను వసూలు చేయడం దుర్మార్గమని తెలిపారు. ఆస్తివిలువ ఆధారిత ఇంటి పన్ను విధానం, యూజర్ ఛార్జీలు ఇతర ప్రజా వ్యతిరేక పట్టణ సంస్కరణల అంశాన్ని రాబోయే కాలంలో ప్రజా అజెండాగా మార్చాలని, ప్రభుత్వాన్ని, ప్రజా ప్రతినిధులను నిలదీయాలని కోరారు. ఆస్తిపన్ను, చెత్తపన్నుపై న్యాయ పోరాటంతోపాటు ప్రజా పోరాటాలు కొనసాగించాలని తెలిపారు. వేసవిలో మంచినీటి ఎద్దడిని అరికట్టడంలో ప్రభుత్వం, స్థానిక సంస్థలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. వర్షాకాలంలో ప్రజారోగ్య పరిరక్షణకు డ్రెయినేజీ వ్యవస్థ మెరుగుదలకు ముందస్తుగా చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పాలకవర్గాలు ఏర్పడి రెండేళ్లు దాటిపోయినా అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని వివరించారు. ప్రజా ప్రతినిధులను ప్రజలు నిలదీస్తున్నారని, స్థానిక సంస్థల నిధులను మళ్లిస్తూ ప్రభుత్వం ఖజానా నింపుకుంటోందని తెలిపారు. గృహ నిర్మాణం, ఇళ్లస్థలాల పంపిణీ, పట్టాలు, రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. పట్టణాల్లో టిడ్కో ఇళ్ల కేటాయింపు జరగలేదన్నారు. పేదల నుండి బలవంతంగా ఇంటి పేరుతో రూ.35 వేల నుండి లక్ష రూపాయల వరకూ వసూలు చేస్తున్నారని తెలిపారు. దశాబ్దాల తరబడి ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలను క్రబద్ధీకరించడం లేదని విమర్శించారు. రిజిస్ట్రేషన్లు చేయడం లేదని, జగనన్న కాలనీలు, రాజధానిలో ఇళ్ల నిర్మాణం పేరుతో పేదల ఇళ్లను తొలగించడానికి ప్రయత్నించడం శోచనీయమని అన్నారు. ఇళ్ల పట్టాలు, మౌలిక సదుపాయాల కల్పనపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.










