హైదరాబాద్: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్ సైబర్ టవర్ వద్ద వరుసగా రెండో రోజు ఆందోళనకు సిద్ధమైన ఐటీ ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. గురువారం మధ్యాహ్నం 3గంటల సమయంలో నిరసన ప్రదర్శన చేపట్టేందుకు హైటెక్ సిటీ సైబర్ టవర్ వద్దకు చేరుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు.. సైబర్ టవర్ వద్ద ఎలాంటి ఆందోళనలు చేయవద్దంటూ ఐటీ ఉద్యోగులను అడ్డుకున్నారు. సైబర్ టవర్ పరిసరాల్లో యువత ఐడీలను పరిశీలిస్తూ బయటకు వచ్చిన ఉద్యోగులను కార్యాలయాల్లోకి పంపే ప్రయత్నం చేశారు. నిరసన తెలిపేందుకు వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని పోలీసు వాహనాల్లో అక్కడి నుంచి తరలించారు.










