టిడిపి వారే ఈ దారుణానికి పాల్పడ్డారు : ఎమ్మెల్యే కాసు
మాకు సంబంధం లేదు : మాజీ ఎమ్మెల్యే యరపతినేని
ప్రజాశక్తి- పిడుగురాళ్ల (పల్నాడు జిల్లా) :పల్నాడు జిల్లా గురజాల మండలంలో సోమవారం రాత్రి వైసిపి కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాయి. ఈ ఘటన రాజకీయరంగు పులుముకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం... పులిపాడు గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్త కూనిరెడ్డి కృష్ణారెడ్డి (30) ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో సంగమేశ్వరం వద్ద ఆయనపై సుమారు ఐదుగురు వ్యక్తులు కళ్లల్లో కారం చల్లారు. అనంతరం వేట కొడవళ్లు, గొడ్డలతో హత్య చేశారు. ఈ దారుణానికి పాల్పడింది ఎవరనేది ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు తెలిపారు. మూడు బృందాలను నియమించి దర్యాప్తు చేస్తున్నట్టు గురజాల డిఎస్‌పి పల్లపు రాజు చెప్పారు. ముఖానికి వస్త్రం కట్టుకుని వచ్చిన దుండగులు మారణాయుధాలతో దాడి చేశారని తెలిపారు. హతుడు శరీరంపై 22 గాయాలు ఉన్నట్టు చెప్పారు. ఈ ఘటనపై గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి స్పందించారు. టిడిపి నాయకుల ప్రమేయంతోనే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. హతుడు కూనిరెడ్డి కుటుంబసభ్యులను మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి పరామర్శించారు. రాజకీయ కక్షలతోనే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. ఈ హత్యతో టిడిపి వారికి ఎటువంటి సంబంధమూ లేదని, వ్యక్తిగత కారణాలతోనే ఈ హత్య జరిగి ఉంటుందని టిడిపి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ ఘటన నేపథ్యంలో గురజాల మండలంలో ఫ్యాక్షన్ గ్రామమైన పులిపాడులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.










