ప్రజాశక్తి- పెందుర్తి (విశాఖపట్నం) : బంగారం కోసం ఓ వృద్ధురాలిని వార్డు వలంటీర్ హత్య చేశాడు. ఈ ఘటన జివిఎంసి 97వ వార్డులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎడిసిపి గంగాధర్ కథనం ప్రకారం... పురుషోత్తపురం మెయిన్ రోడ్డులో ఉంటున్న టి.శ్రీనివాసరావు తల్లి వరలక్ష్మికి వినికిడి లోపం ఉంది. వార్డు వలంటీరు రాయవరపు వెంకటేష్ హెల్పర్‌గా 20 రోజుల క్రితం శ్రీనివాసరావు వద్ద చేరాడు. ఆదివారం రాత్రి శ్రీనివాసరావు ఇంటికి వెంకటేష్ వచ్చి ఇంట్లోని బంగారం కోసం వెతికాడు. దీన్ని గమనించిన వృద్ధురాలు వరలక్ష్మి గట్టిగా కేకలు వేయడంతో తల దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి ఆమెను హత్య చేశాడు. రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చిన శ్రీనివాసరావు తన తల్లిది సహజ మరణమని తొలుత భావించారు. మెడలోని బంగారు గొలుసు కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిసి పుటేజీల ఆధారంగా వెంకటేషే హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చి అతనిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.










