భర్త రెండవ భార్య కుటుంబీకుల పనేనని అనుమానం
ప్రజాశక్తి- మదనపల్లె అర్బన్ (అన్నమయ్య జిల్లా) :అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై మహిళా లెక్చరర్ హత్యకు గురయ్యారు. మృతురాలి కుటుంబసభ్యుల కథనం ప్రకారం... ప్రశాంత్ నగర్‌కు చెందిన కదీర్ అహ్మద్ భార్య రుక్సానా (32) మదనపల్లెలోని జ్ఞానాంబిక జూనియర్ కళాశాలలో ఇంగ్లీషు లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కాలేజీ నుంచి తన ఇంటికి ద్విచక్ర వాహనంపై ఆమె వెళ్తున్నారు. ప్రశాంత్ నగర్‌లోని సంగం ఫంక్షన్ హాల్ రోడ్డులో గుర్తు తెలియని దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమెను వెంటాడి మరీ గొంతు కోసి హత్య చేశారు. అనంతరం వారు తమ ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యారు. ఘటనా స్థలాన్ని మదనపల్లి డిఎస్‌పి కేశప్ప, వన్‌టౌన్ సిఐ మహబూబ్ బాషా, టూ టౌన్ ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి పరిశీలించారు. సిసి కెమెరాల ద్వారా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాన్ని మదనపల్లి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
2వ భార్య కుటుంబీకులే హత్య చేశారా?
రుక్సానా భర్త కదీర్ అహ్మద్ పట్టణంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌లో డ్యూటీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. రుక్సానాకు చాలా సంవత్సరాల క్రితం వివాహమైనా పిల్లలు లేకపోవడంతో కదీర్ 2వ వివాహం చేసుకున్నారు. రెండవ భార్య అయిషాకు కూడా పిల్లలు లేరు. రుక్సానాకు 18 నెలల క్రితం ఆడపిల్ల జన్మించింది. దీంతో, అప్పటి నుంచి అయిషా బంధువులు ఆమెపై కక్ష పెంచుకున్నారు. చంపుతామని బెదిరించారు. పలుమార్లు గొడవకు దిగారు. దీనిపై రెండవ పట్టణ పోలీసులకు తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రుక్సానా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అయిషా బంధువులే తమ కుమార్తెను హత్య చేసి ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.










