ప్రజాశక్తి-తిరుమల :తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)కి చెందిన ఎలక్ట్రిక్ బస్సు చోరీకి గురైంది. గుర్తు తెలియని వ్యక్తి ఈ బస్సును అపహరించాడు. బస్సు బ్యాటరీ ఛార్జింగ్ అయిపోవడంతో దీనిని రోడ్డు పక్కనే వదిలేసి వెళ్లిపోయాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం... మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ ప్రయివేట్ లిమిటెడ్ అనే సంస్థ టిటిడికి గతంలో పది ఎలక్ట్రిక్ బస్సులను ఉచితంగా ఇచ్చింది. ఈ బస్సులను ధర్మరథాల పేరుతో తిరుమలలో సందర్శకుల కోసం టిటిడి ఉచితంగా నడుపుతోంది. తిరుమలలోని గరుడాద్రి నగర్ వర్క్‌షాపులో ఉంచిన ఇందులోని ఒక బస్సును గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం వేకువజామున అపహరించుకుపోయాడు. ఈ విషయాన్ని ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో టిటిడి అధికారులు గుర్తించి దర్యాప్తు చేపట్టారు. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఈ బస్సు టోల్‌గేట్ దాటినట్లు ఈ బస్సుకు ఉన్న జిఎన్‌సి సిస్టం ద్వారా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నాయుడుపేట వద్ద బస్సు లోకేషన్ చూపించింది. దీంతో, అక్కడి పోలీసులకు టిటిడి అధికారులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా, బస్సు అక్కడ ఉంది. ఛార్జింగ్ అయిపోవడంతో బస్సుని రోడ్డు పక్కన నిలిపివేసి దొంగ పరారయ్యాడు. పోలీసులు ఈ బస్సును స్వాధీనం చేసుకొని టిటిడి అధికారులకు అప్పగించారు. ఈ బస్సు ఖరీదు రూ.1.44 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులకు రక్షణ లేకపోవడం, నిఘా వర్గాల వైఫలమే ఈ ఘటనకు కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, వారం రోజుల క్రితం టిటిడికి చెందిన ఎలక్ట్రిక్ కారు కూడా మిస్సయినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒంటిమిట్ట రామాలయం వద్ద ఈ కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే, కారు మిస్సింగ్ ఘటనపై పోలీసులకు టిటిడి అధికారులు ఫిర్యాదు చేయనట్లు సమాచారం.










