పుంగనూరులో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి : సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్
పుంగనూరు (చిత్తూరు) : పుంగనూరు నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యలపై మాట్లాడేవారిపై పోలీసులు 30 యాక్ట్ పేరుతో ఉక్కు పాదం మోపడం దుర్మార్గమని వెంటనే వాటిని ఎత్తివేయాలని చిత్తూరులోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఎం చిత్తూరు జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ ... ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజా సమస్యలపై ప్రతి పౌరుడికి మాట్లాడే హక్కు ఉందని తెలిపారు. రాజ్యాంగానికతీతంగా పుంగనూరు నియోజకవర్గం ఉందా అని ప్రశ్నించారు. రాజ్యాంగానికి లోబడే ఇక్కడ కూడా వ్యవహరించాలని తెలిపారు. పోలీసులు అత్యుత్సాహం చూపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఈ పద్ధతిని వెంటనే మానుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో అనేక రకాల సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారని ప్రధానంగా రైతాంగం, పాల రైతులు గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్నారని అన్నారు. మరి ఇలాంటి సందర్భంలో వారి సమస్యలను ప్రస్తావించేవారి గొంతు నొక్కడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీలకు ఓ రకంగా, అధికారంలోకి వచ్చిన పార్టీలకు ఒక రకంగా పోలీసులు వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రజా సమస్యలపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని రాజకీయాలకతీతంగా ప్రజలకు సేవ చేయాలని రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని తెలిపారు. కొంతమంది పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. రామచంద్ర యాదవ్ ఇంటిపై భౌతిక దాడులకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల వారి తీరును మార్చుకొని ప్రజల మన్ననలను పొందాలని కోరారు.










