Aug 05,2023 09:30
  • వైసిపి వర్సస్‌ టిడిపి
  • పోలీసులపై రాళ్లదాడి
  • రణరంగంగా పుంగనూరు
  • లాఠీఛార్జి, భాష్పవాయువు ప్రయోగం
  • పాలసముద్రం ఎస్‌ఐ సహా పలువురికి గాయాలు

టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తలపెట్టిన 'ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ద భేరీ' యాత్రలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసిపి, టిడిపి శ్రేణులు పరస్పరం దాడులకు దిగాయి. రాళ్లదాడులు, వాహనాలను తగలబెట్టడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు గ్రామం వద్ద తొలుత ఘర్షణ ప్రారంభమైంది. ఆ గ్రామంలో చంద్రబాబును అడ్డుకోవడానికి వైసిపి కార్యకర్తలు ప్రయత్నిండంతో పాటు కాన్వారుపై రాళ్ల దాడి చేయడంతో ప్రారంభమైన ఉద్రిక్తత చిత్తూరు జిల్లాకూ వ్యాపించింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పుంగనూరు వద్ద పోలీసులు లాఠీఛార్జీ చేయడంతో పాటు, భాష్పవాయువు ప్రయోగించారు. ఈ దాడుల్లో ఒక ఎస్‌ఐతో పాటు రెండు పార్టీలకు చెందిన పలువురికి తీవ్ర గాయాలైనాయి. ఈ పరిస్థితికి కారణం మీరంటే మీరని రెండు పార్టీల నాయకులు ఆరోపణలకు దిగారు. శనివారం నాడు చిత్తురు జిల్లా బంద్‌కు వైసిపి పిలుపునిచ్చింది. ప్రజాశక్తి- పుంగనూరు (చిత్తూరు జిల్లా), కురబలకోట (అన్నమయ్య జిల్లా)
         శుక్రవారం ఉదయం నుండే పుంగనూరులో వైసిపి శ్రేణులు బాబు పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించాయి. ఉదయం 11 గంటలకు నల్ల జెండాలతో ప్రదర్శనలు చేయడంతో పాటు, చంద్రబాబు గో బ్యాక్‌ అంటూ ప్లకార్డులను వైసిపి కార్యకర్తలు ప్రదర్శించారు. మరోవైపు చంద్రబాబుకు పుంగనూరు పట్టణంలోకి అనుమతి లేదని, బైపాస్‌ రోడ్డుపైన ఆయన చిత్తూరుకు వెళ్లాలని చెబుతూ పోలీసులు బ్యారికేడ్లు అడ్డం పెట్టారు. అప్పటికే అన్నమయ్య జిల్లాలో వైసిపి కార్యకర్తలు చేసిన దాడి విషయం తెలియడంతో టిడిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కృష్ణదేవరాయ సర్కిల్‌ వద్దకు చేరుకున్నారు. చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు. పుంగనూరులోకి అనుమతి ఇచ్చేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో, పోలీసులకు, టిడిపి శ్రేణులకు మధ్య వాగ్వివాదం జరిగింది. టిడిపి శ్రేణులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ సమయంలో పోలీసులపై రాళ్లదాడి జరిగింది. కొందరు పోలీస్‌ వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ దాడిలో పాలసముద్రం ఎస్‌ఐ ప్రసాద్‌తో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. గాయపడిన పోలీసులను ప్రథమ చికిత్స నిమిత్తం పుంగనూరు ఆస్పత్రికి తరలించారు. ఉద్త్రిక్తత నేపథ్యంలో ఏ నిమిషంలో ఏం జరుగుతుందోనని జనం భయం గుప్పిట్లో ఇళ్లల్లో తలుపులు వేసుకునే ఉన్నారు. షాపులు మూసేశారు. దాదాపు 500 మంది పోలీసులు పుంగనూరులో మోహరించారు. ఈ సంఘటనలన్నీ చంద్రబాబు నాయుడు రాక మునుపే జరిగిపోయాయి. సాయంత్రం 5.30 గంటల తర్వాత బైపాస్‌ రోడ్డులోని ఓ గ్రామంలో పర్యటించి చిత్తూరుకు వెళ్లారు.
 

                                                     పోలీసులపై దాడి చేసిన వారిని ఉపేక్షించేది లేదు : ఎస్‌పి

పోలీసులపై దాడులకు పాల్పడిన వారు ఎంతటి వారైన ఉపేక్షించేది లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్‌పి రిశాంత్‌ రెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు టూర్‌ షెడ్యూల్‌ ప్రకారం పుంగనూరులోకి రావడానికి ఎటువంటి అనుమతీ తీసుకోలేదన్నారు. వారు ఇచ్చిన కార్యక్రమం ప్రకారమే 400 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు ఏర్పాటు చేశామని తెలిపారు. పుంగనూరులోనికి రాకుండా హైవేపై చిత్తూరుకు వెళ్లాల్సి ఉందన్నారు. శాంతిభద్రతల దృష్ట్యా పుంగనూరులోకి రానీయకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అయినా, కొందరు అల్లరి మూకలు దౌర్జన్యంగా మిగతా 5లో పుంగనూరులోకి ప్రవేశించి ముందుగానే తెచ్చుకున్న బీర్‌ బాటిల్స్‌, కర్రలు, రాళ్లతో పోలీసులపై దాడి చేసిందన్నారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే పోలీసులపై దాడులు జరిగాయని, 50 మంది పోలీసులు గాయపడ్డారని, వారిలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. రెండు పోలీసు వాహనాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారన్నారు. అల్లరి మూకలపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గాయపడిన పోలీసులను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
 

                                                                       అన్నమయ్య జిల్లాలో ...

అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో వైసిపి శ్రేణులు రెచ్చిపోయారు. ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరిలో భాగంగా అంగళ్లు నుంచి పుంగనూరుకు చంద్రబాబు వెళ్తుండగా, ఆయన కాన్వారులోని వాహనాలపైనా, ప్రసంగిస్తున్న సమయంలోనూ రాళ్ల దాడి చేశాయి. టిడిపి వారుకట్టిన బ్యానర్లను వైసిపి కార్యకర్తలు చించేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన టిడిపి కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారు. టిడిపి వారు కూడా వైసిపి వారిపై రాళ్లు రువ్వారు , వైసిపి రాళ్ల దాడిలో మదనపల్లె మండలం కొత్తపల్లి ఎంపిటిసి సభ్యులు దేవేంద్ర పాటు మరో టిడిపి కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో 20కిపైగా కార్ల అద్దాలు ధ్వంసమైనట్టు సమాచారం. చంద్రబాబుకు వ్యతిరేకంగా తంబళ్లపల్లిలోనూ నల్ల జెండాలతో వైసిపి శ్రేణులు నిరసన తెలిపాయి.
 

                                                        మంత్రి పెద్దిరెడ్డి పతనం ప్రారంభమైంది : చంద్రబాబు

తన పర్యటనలో ప్రజల నుంచి వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక తన కార్యకర్తలు, నాయకులపై వైసిపి కార్యకర్తలతో దాడి చేయిస్తున్నారని, మంత్రి పెద్దిరెడ్డి పతనం ప్రారంభమైందని, ఈ రోజు నుంచి రోజులు లెక్కపెట్టుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు. తన కాన్వారుపై దాడి చేయడం తాను ప్రసంగిస్తున్న సమయంలో రాళ్ల దాడి జరిగిందని, ఇది ఒక చీకటి రోజని, పోలీసులు ఎవరికి ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లరి మూకలను అదుపులోకి తేలేని పోలీసుల తప్పుకుంటే మా కార్యకర్తలే రంగంలోకి దిగుతారన్నారు. పెద్దిరెడ్డి రౌడీయిజాన్ని పాతాళానికి తొక్కేస్తానని అన్నారు.