Apr 12,2023 12:49

ప్రజాశక్తి -భీమవరం (పశ్చిమ గోదావరి) : ''ప్రజా వ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బిజెపీని సాగనంపుదాం-దేశాన్ని కాపాడుకుందాం'' అనే నినాదంతో ఏప్రిల్‌ 14 నుండి సిపిఎం, సిపిఐ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు జరుపుతున్న ప్రచార భేరి పోస్టర్‌ను బుధవారం మెంటేవారితోట సిపిఎం ఆఫీసులో ఉభయ కమ్యూనిస్టు నాయకులు ఆవిష్కరించారు.

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గన్న సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ ... దేశానికి కాపలాదారుగా ఉంటానని ఎన్నో మోసపూరితమైన మాటలు చెప్పి దేశ ప్రధాని అయిన తరువాత దేశాన్ని కార్పోరేట్లకు కారుచౌకగా మోడీ కట్టబెడుతున్నాడని అన్నారు. 75 ఏళ్ళ స్వాతంత్య్ర భారత దేశంలో సాధించుకున్న ప్రభుత్వరంగ సంస్ధలను అంబానీ, ఆదానీలకు కట్టబెడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలను నియంత్రిస్తాం. రైతాంగాన్ని ఆదుకుంటాం.. స్వర్ణ భారతాన్ని సాధిస్తాం .. అని వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చిన 9 సంవత్సరాల కాలంలో అభివఅద్ది సూచీలో భారత దేశాన్ని అట్టడుగు స్థాయికి తీసుకువెళ్ళిపోయిన ఘనత మోడీదని అన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి దేశ లౌకికతత్వాన్ని దెబ్బతీస్తూ అట్టడుగు వర్గాలవారిపై దాడులు చేస్తున్నారని భీమారావు ఆవేదన వ్యక్తం చేశారు.
         సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ ... కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పూర్తిగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తోందన్నారు. రాష్ట్రానికి బిజెపి తీరని ద్రోహం చేసిందన్నారు. రాష్ట్రానికి రైల్వేజోన్‌ ఇస్తామన్నారు.. కడపలో స్టీలు ప్లాంటు ఇస్తామన్నారు... ఇప్పుడు నోరు మెదపడంలేదని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హౌదా లేదనీ, రాజధాని నిర్మాణానికి నిధులు లేవు అని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇవ్వడం లేదనీ, నిర్వాసితులను ఆదుకోలేదనీ, ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టి.. నరేంద్ర మోడి ఆంధ్రరాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని బలరాం ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోలు, డీజిల్‌ ధరలను, నిత్యావసర వస్తువుల ధరలను, టోల్గేట్‌ ధరలను, ఎరువుల ధరలను, ప్రజల ఔషదాల ధరలను పెంచి జిఎస్టీ తీసుకువచ్చి ప్రజల వస్త్రాల ధరలు, ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ ధరలు, అన్ని వస్తువుల ధరలను చివరకు స్కూలు పిల్లల రాసుకునే పెన్నులు, పెన్సిల్‌ పైన జిఎస్టీ వేసి విపరీతమైన ధరలు పెంచిందన్నారు. రవాణా రంగంలో మార్పులు తీసుకువచ్చి వాహనాల ఇన్సూరెన్సులు, ల్కెప్‌టాక్స్‌లు విపరీతంగా పెంచిందని, ప్రజలు ఏమీ కొనలేని దుస్థితికి తీసుకువచ్చిన బిజెపి ... దేశ ఉత్పత్తిని తిరోగమన పాలు చేసి నిరుద్యోగాన్ని సృష్టించిన ఘనత నరేంద్ర మోడీదని బలరాం ధ్వజమెత్తారు. నరేంద్ర మోడీ విధానాలను ప్రజల్లో ఎండగట్టేందుకు ఈ నెల 14 నుండి 30 వరకు సిపిఎం, సిపిఐలు ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రచారభేరికి ప్రజలంతా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి చెల్లబోయిన రంగరావు, ఎస్‌.పుష్పకుమారి, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జె.ఎన్‌.వి గోపాలన్‌, బి.వాసుదేవరావులు పాల్గొన్నారు.