Jun 29,2023 21:54

బిజెపికి వ్యతిరేకంగా తొలిసారి ఒకే వేదికపై మేధావుల ప్రకటన
అధికార, ప్రతిపక్షపార్టీల అండతో బలపడే ప్రయత్నం
బిజెపికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అని ప్రకటన

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :రాష్ట్రానికి హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా ద్రోహం చేసిన బిజెపి అధికార, ప్రతిపక్ష పార్టీల అండతో బలపడేందుకు ప్రయత్నిస్తోందని ఈ కుట్రలను తిప్పికొట్టి బిజెపి కుయుక్తుల నుండి రాష్ట్రాన్ని కాపాడాలని మేధావులు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్రంలో వేర్వేరు రంగాలకు చెందిన మేధావులు పాల్గని మాట్లాడారు. 'బిజెపిని ఒంటరి చేసి రాష్ట్రాన్ని కాపాడండి.. రాష్ట్ర పౌరులకు వివిధ రంగాలకు ప్రముఖల విజ్ఞప్తి' పేరుతో రచయితలు, వైద్యులు, ప్రొఫెసర్లు, వేర్వేరు హక్కుల వేదికలు, అభ్యుదయవాదులు సుమారు 500 మంది సంతకాలు చేసిన విజ్ఞాపన పత్రాన్ని వారు విడుదల చేశారు.
బిజెపి చేస్తున్న మోసాలు, దానికి రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు వత్తాసు పలకడం వంటి అనేక అంశాలపై వారు స్పందించారు. ఈ సందర్భంగా ప్రముఖ రైతు నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని మోడీ దేశాన్ని అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని అన్నారు. విభజన సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని, అటువంటి బిజెపి ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న వైసిపి, టిడిపి, జనసేన ఎందుకు మద్దతు తెలుపుతున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజల్లో బలం లేని బిజెపికి రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా రానన్ని ఓట్లు వచ్చాయని, ఇంతకంటే దిగజారుడుతనం మరొకటి లేదని అన్నారు. పార్లమెంటులో పెట్టే ప్రజావ్యతిరేక బిల్లులు ముఖ్యంగా వ్యవసాయ చట్టాలు, విద్యుత్‌ సంస్కరణల బిల్లులకు వైసిపి, టిడిపి సంపూర్ణ మద్దతు ఇచ్చాయని విమర్శించారు. ప్రధాని మోడీకి ప్రజాస్వామ్యం అన్నా, ఫెడరల్‌ వ్యవస్థ అన్నా గౌరవం లేదని మతం పేరుతో బిజెపి పాలిత రాష్ట్రాల్లో నరమేధం జరుగుతోందని అన్నారు. ఉపా చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని, వారి దోపిడీకి అడ్డు వచ్చిన వారందరిపై ఉపా చట్టాన్ని పెట్టి జైల్లోనే చనిపోయేలా చేస్తోందని విమర్శించారు. మణిపూర్‌లో గిరిజన ప్రాంతాల్లో దోపిడీ కోసం తెగల మధ్య ఘర్షణ రెచ్చగొట్టిందని పేర్కొన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అరాచక పాలన సాగుతోందని వివరించారు. ప్రధాని మోడీ కంటే అవినీతిపరులు మరొకరు లేరని విమర్శించారు. కేంద్ర మాజీ మంత్రి ప్రఖ్యాత ఇంజనీరు డాక్టర్‌ కె.ఎల్‌.రావు కుమారుడు కె.విజయరావు మాట్లాడుతూ దేశంలో ఘర్షణలు పెంచుతూ బిజెపి తన దోపిడీని కొనసాగిస్తోందని తెలిపారు. సామాజిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారని, గుజరాత్‌లో చిన్న ఘటన జరిగితే వెళ్లే ప్రధానికి మణిపూర్‌లో అంత ఘర్షణలు జరుగుతున్నా పట్టడం లేదని అన్నారు. హిందూ వ్యతిరేకులనే పేరుతో అనేకకులాల వారిపై దాడులకు పాల్పడటంతోపాటు హత్యలు కూడా చేస్తున్నారని విమర్శించారు. ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొడుతున్న ఎంపిలు, కేంద్ర మంత్రులపై ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ లేవని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని విమర్శించారు. పిఎంకేర్‌, ఎలక్టోరల్‌ బాండ్స్‌ పేరుతో పచ్చి దోపిడీ జరుగుతోందని అన్నారు. దేశంలో ప్రశాంతత లేదని, ఇక అభివృద్ధి ఎక్కడ నుండి వస్తుందని ప్రశ్నించారు. దేశం అభివృద్ధి చెందాలంటే బిజెపి పోవాలన్నారు.
ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మగౌరవమైన విశాఖస్టీలును అమ్మేస్తుంటే వైసిపి, టిడిపి, జనసేన నోరెత్తడం లేదని అన్నారు. ఇస్తానన్న హోదాను ఇవ్వలేదని, రామయపట్నం పోర్టును రాష్ట్రంపై వదిలేశారని విమర్శించారు. ప్రముఖ ఆర్థికవేత్త పాపారావు మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపి లేకపోయినా రాజకీయ పక్షాల్లో ఉందని, అలా ఎందుకు జరుగుతుందో రాజకీయ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు.
ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ దేశంలో అరాచకం జరుగుతోందని, ఒక్కరికీ కూడా న్యాయం జరిగిందన్న మాట లేదని తెలిపారు. రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేకపోయినా పార్లమెంటులో బిజెపికి పూర్తి మెజార్టీ వచ్చే రాష్ట్రాల్లో ఎపి తొలిస్థానంలో ఉందని, అన్నిసార్లు గెలిచిన గుజరాత్‌లోనూ బిజెపికి పూర్తి మెజార్టీ లేదని తెలిపారు. పలువురు ప్రముఖులు కూడా ఈ వేదికపై మాట్లాడారు.
విజ్ఞాపనపత్రంపై సంతకాలు చేసిన వారిలో ప్రముఖకవి రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, గంటాడ గౌరునాయుడు, జి.నరుసునాయుడు, గోళ్ల నారాయణరావు, కె.ఎన్‌.మల్లేశ్వరి, అరుణ గోగులమండ, ప్రొఫెసర్‌ ఎన్‌.అంజయ్య, ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ మాజీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ జార్జి విక్టర్‌, ఐవి సుబ్బారావు, ఎ.అజశర్మ తదితరులు ఉన్నారు.
రాష్ట్ర పార్టీల వత్తాసు
ప్రముఖులు డివివిఎస్‌ వర్మ
వచ్చే ఎన్నికల్లో బిజెపికి సీట్లు వస్తాయన్న రాష్ట్రం ఒక్కటీ కనిపించడం లేదు. రాష్ట్రంలో మాత్రం ఎగబడి ఎందుకు బిజెపి వెనుక వెళుతున్నారో తెలపాలి. అభివృద్ధి అనే పదానికంటే అవినీతి అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో బిజెపికి వెంటబడుతున్న వారు ముందు ప్రజలకు సమాధానం చెప్పాలి.
ఓట్లు లేకపోయినా పెత్తనం
ప్రముఖ రచయిత డాక్టర్‌ వసుంధర
రాష్ట్రంలో బిజెపి లేకపోయినా వైసిపి, టిడిపి, జనసేన మద్దతుతో బలమైన వ్యవస్థగా ఉంది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. ఎక్కడైనా ఓట్లు ఉంటే బలమైన రాజకీయ పార్టీ అంటారు. నోటాకంటే తక్కువ ఓట్లు వచ్చినా బిజెపి రాష్ట్రంలో బలంగా ఉండటానికి కారణం ఇక్కడ పార్టీలే.
ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలి
భారత్‌ బచావో నాయకులు భాస్కరరావు
దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాస్వామ్యం అనే మాటకు విలువ లేకుండా చేస్తున్నారు. మాట్లాడితే కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారు. దోపిడీ చేస్తున్నారు. దీనిపై ప్రశ్నించేందుకు ఒక వేదిక అవసరం.
అంతర్జాతీయ క్రీడాకారులకే న్యాయం లేదు
ప్రముఖ వ్యాపారవేత్త మలినేని నారాయణప్రసాదు
అంతర్జాతీయంగా దేశానికి అవార్డులు తెచ్చిపెట్టిన క్రీడాకారులు అన్యాయం జరుగుతోందని చెబితే బాధ్యుడైన ఎంపిపై కనీస చర్యలు తీసుకోని దుర్మార్గ పాలన దేశంలో ఉంది. దేశానికి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చినవారు చెబుతున్న అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేని అన్యాయమైన పాలన సాగుతోంది. ముడి చమురును అతి తక్కువ ధరకు కొంటూ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రజలను దోచుకోవడం తప్ప న్యాయం జరిగే పరిస్థితి కనిపించడం లేదు.
ప్రపంచంలో ఎక్కడా నిలబడలేని పరిస్థితి
బార్‌ కౌన్సిల్‌ సభ్యులు సుంకర రాజేంద్రప్రసాద్‌
విశ్వగురువు అని ప్రచారం చేసుకుంటూ ప్రపంచంలో ఎక్కడా నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. ఏ రంగంలోనూ ముందుకు వెళ్లడం లేదు. మోడీ ప్రచారం తప్ప దేశానికి ఆదరణ లేని స్థితిని బిజెపి పాలకులు తీసుకొచ్చారు. విదేశాలకు వెళ్లినా ఆదానీ, అంబానీకి దోచిపెట్టే పనే తప్ప ప్రజలకు ఏం చేద్దామనే ఆలోచన కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో బిజెపిని సాగనంపాల్సిన అవసరం ఉంది.
అన్యాయంపై ప్రశ్నిస్తే సస్పెన్షన్లు
అభివృద్ధి వేదిక నాయకులు నేతి మహేశ్వరరావు
దేశంలో జరుగుతున్న అన్యాయంపై పార్లమెంటులో గళమెత్తితే ఎంపిలను సస్పెండ్‌ చేస్తున్నారు. రక్షణ రంగంలోకి తీసుకురాకూడని సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చారు. అదానీకి లక్షల కోట్లు అప్పగించారు. వీటిని ప్రశ్నించినందుకు కాంగ్రెస్‌ ఎంపి రాహుల్‌గాంధీని సస్పెండ్‌ చేశారు. లక్షల కోట్లు దోచుకుంటున్నా ప్రశ్నించకూడదనే నియంతృత్వ పాలన బిజెపి చేస్తోంది. మోడీని గద్దె దించకపోతే దేశం అదోగతి పాలవుతుంది.
ప్రజాస్వామ్యమంటే బిజెపికి విలువ లేదు
జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ నాయకులు ఎస్‌.వెంకట్రావు
ప్రజాస్వామ్యం పట్ల మోడీ ప్రభుత్వానికి విలువలేదు. ప్రశ్నించిన వారిని అన్యాయంగా జైల్లో పెడుతున్నారు. బలవంతంగా కేసులు బనాయిస్తున్నారు. ప్రజలను ప్రజాస్వామ్య విలువలను పట్టించుకోని బిజెపిని గద్దె దించాల్సిన అవసరం ఉంది.
ఘర్షణపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు
కృష్ణాజిల్లా పరిషత్‌ మాజీ వైస్‌ఛైర్మన్‌ గొట్టిపాటి వెంకట రామకృష్ణ
బిజెపికి మత ఘర్షణలు సృష్టించడంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు. ఘర్షణల చాటున దేశాన్ని దోచుకుంటున్నారు. వాళ్లు ఎక్కడ దోపిడీ చేయాలనుకుంటే అక్కడ కులపరమైనవో, మతపరమైనవో, జాతుల మధ్యో ఘర్షణలు సృష్టిస్తున్నారు. మణిపూర్లో ఘర్షణలు కూడా ఇందులో భాగమే. వాటిని నివారించే పని కేంద్రం చేయడం లేదు. దీనివెనుక ఏదో కుట్ర ఉంది.
అందరూ ఐక్యమైతేనే న్యాయం
రైతు నాయకులు ఎర్నేని నాగేంద్రనాధ్‌
ప్రజా వ్యతిరేకమైన బిజెపిని గద్దె దించేందుకు అన్ని పక్షాలూ ఐక్యమవ్వాలి. పార్లమెంటులో పూర్తి అధికారం ఉందనే పేరుతో బిజెపి ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. దేశంలో అదానీ, అంబానీ తప్ప మోడీకి మరెవరూ కనిపించడం లేదు. ప్రజాస్వామ్యంపై పార్లమెంటులోనూ ప్రస్తావన లేదు. మోడీ భజన తప్ప మరోపనిలేని విధంగా సభలు జరుపుతున్నారు. దీనిపై నిలదీయాలి. రైతులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాలి. పోలవరానికి న్యాయం చేయలేని పార్టీని గద్దె దించాలి.
అంబటి ఆంజనేయులుకు నివాళి
విలేకరుల సమావేశానికి ముందు ఎపియుడబ్ల్యుజె నాయకులు అంబటి ఆంజనేయులు మృతికి సంతాపంగా మేధావులు నిముషంపాటు మౌనం పాటించారు. జర్నలిస్టుగా అందరితోనూ సహృదయంతో మెలిగేవారని పేర్కొన్నారు.