Jun 09,2023 14:19

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ 9 ఏళ్ళ విద్రోహ పాలనపై ఈనెల 11న జరిగే నిరసన ర్యాలీ విజయవంతం చేయాలని విశాఖ వామపక్ష పార్టీలు విశాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. మద్దిలపాలెం పిఠాపురం కాలనీలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, సిపిఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై.కొండయ్య, ఎంసిపిఐ జిల్లా కార్యదర్శి కె.శంకరరావులు మాట్లాడుతూ ... కేంద్ర బిజెపి ప్రభుత్వం తమ 9 ఏళ్ళ పాలనలో ఆంధ్ర రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు, విశాఖపట్నానికి తీవ్ర ద్రోహం చేసిందన్నారు. విశాఖ మణిహారం వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ను అమ్మకానికి పెట్టింది. పోర్టు, రక్షణరంగం, రైల్వే, విద్యుత్‌ ఆయిల్‌ పరిశ్రమలు, బ్యాంకులు, ఎల్‌ఐసి , పోస్టల్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌ తదితర ప్రభుత్వరంగ సంస్థలన్నింటిని ప్రైవేటీకరిస్తోంది. వేలాది ఉద్యోగాలను హరించి యువతకు అన్యాయం చేస్తోంది. వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పెనుభారాలు మోపింది. కార్మికవర్గం పోరాడి సాధించుకున్న 28 కార్మిక చట్టాలను 4 లేబర్‌కోడ్స్‌గా మార్చి కార్మికులను నిరాయుధులను చేస్తోంది. రైతులకిచ్చే సబ్సిడీలను హరించి, పంటకు సరైన గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా అన్నదాతల ఆత్మహత్యలకు కారణమవుతోంది. పార్లమెంటు సాక్షిగా ఎపి పునర్విభిజన చట్ట హామీలు తుంగలో తొక్కింది. ప్రత్యేక హౌదా ఇవ్వలేదు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యక్ష ప్యాకేజీ, నిధులు కేటాయించలేదు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్‌ ప్రకటించింది. నాలుగున్నరేళ్ళు అయినా ఒక్క అడుగు ముందుకు పడలేదు. అత్యంత ఆదాయం సమకూర్చే వాల్తేరు డివిజన్‌ను ఒరిస్సాకు తరలించింది. పోలవరం ప్రాజెక్టును అవసరమైన నిధులను సకాలంలో ఇవ్వడం లేదు. రాష్ట్రానికి ద్రోహం చేసి విశాఖలో ఈ నెల 11న విజయోత్సవ సభలకు పూనుకోవడం సిగ్గుచేటు. విజయోత్సవ సభ కంటే దీనిని విద్రోహ సభ అంటే సరిపోతుంది. కేంద్ర హౌంమంత్రి అమిత్‌షా విశాఖ సభలో పాల్గొనే ముందు వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ అమ్మకాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాలి. రాష్ట్రానికి ప్రత్యేక హౌదా, విభజన హామీలు, విశాఖ రైల్వే జోన్‌ అమలు చేస్తామని ప్రకటించాలి. కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్స్‌, ప్రభుత్వరంగ ప్రైవేటీకరణ రద్దుచేస్తామని, పోలవరం ప్రాజెక్టుకు సంపూర్ణ నిధులిస్తామని ప్రకటించాలి. అప్పుడే బిజెపి సభను ప్రజలు హర్షిస్తారు. లేనిపక్షంలో ఇది విద్రోహ సభగానే పరిగణిస్తారు. కేంద్రం రాష్ట్రానికి ఇంత ద్రోహం చేస్తుంటే అధికార వైసిపి ప్రభుత్వం, ప్రతిపక్ష తెలుగుదేశం జనసేనలు బిజెపిని పల్లెత్తు మాటనకపోవడం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయడమే. తమ రాజకీయ ప్రయోజనాలు కోసం, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల రక్షణకు, బిజెపి తొమ్మిదేళ్ళ విద్రోహపాలనపై ఈ నెల 11న ఉదయం 10 గంటలకు రైల్వే డి.ఆర్‌.ఎం ఆఫీస్‌ నుండి ఆర్టీసి కాంప్లెక్స్‌ వరకు నిరసన ర్యాలీ చేపడుతున్నాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గని ర్యాలీని విజయవంతం చేయాలని వామపక్షపార్టీలు విజ్ఞప్తి చేసాయి. ఈ ప్రెస్‌మీట్‌లో సిపిఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.