Jun 27,2023 21:45

- రాజకీయాల్లో జవాబుదారీతనం ఉండాలి
ప్రజాశక్తి - భీమవరం:
రాష్ట్రంలో తూర్పు కాపులు 46 లక్షల మంది ఉన్నారని ఆ సంఘం నేతలు చెబుతుంటే గత టిడిపి ప్రభుత్వం 26 లక్షల మంది ఉన్నారని, వైసిపి ప్రభుత్వం కేవలం 16 లక్షల మంది మాత్రమే ఉన్నారని లెక్కలు చూపుతున్నాయని, ఏ ప్రాతిపదికన ఈ లెక్కలు వేశారో చెప్పాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. 2024లో జనసేన అధికారంలోకి వస్తే కులగణాంకాలు తీస్తామని, బిసి గణాంకాలు ఎంతో విలువైనవని చెప్పారు. తూర్పు కాపులకు జనసేన అండగా ఉండి వారి అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. వారాహి యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పెదఅమిరంలోని నిర్మల ఫంక్షన్‌ హాలులో తూర్పుకాపు సంఘం నేతలను పవన్‌ భేటీ అయ్యారు. ఆల్‌ ఇండియా తూర్పుకాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు పిసిని చంద్రమోహన్‌ ఆధ్వర్యంలో తూర్పు కాపు ముఖ్య నాయకులు పవన్‌ సమక్షంలో జనసేనలో చేరారు. తూర్పుకాపుల సమస్యలను వారు పవన్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఉత్తరాంధ్ర మినహా ఇక ఎక్కడా తూర్పుకాపులకు ఒబిసి పత్రాలు ఇవ్వడం లేదన్నారు. ఆర్థిక బలం లేక 75 శాతం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. భీమవరం తనకు బలమైన జ్ఞాపకాలను ఇచ్చిందని, ప్రజా సమస్యలను తెలుసుకునే జనవాణి కార్యక్రమం ఇక్కడి నుంచే ప్రారంభించానని గుర్తు చేశారు. వంశధార ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన నిర్వాసితులు ఎక్కువ మంది తూర్పు కాపులేనన్నారు. వారికి కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వలేదని చెప్పడం బాధ కలిగించిందని తెలిపారు. వ్యవస్థలు సక్రమంగా పని చేయకపోవడం వల్లే న్యాయం కోసం కుల భావన బలంగా పెరిగిందన్నారు. బిసి గణాంకాలు విలువైనవని, ప్రస్తుతం వాటి అవసరం ఎంతో ఉందని చెప్పారు. రాజకీయాల్లో జవాబుదారీతనం రావాలని, దీనికి జనసేన కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో పిఎసి చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు (చినబాబు), ముఖ్యనేత కనకరాజు సూరి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పవన్‌కు స్వల్ప అస్వస్థత
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్రలో భాగంగా సోమవారం రాత్రి నరసాపురం నుంచి భీమవరం చేరుకున్నారు. అప్పటికే ఆయన కొంత అస్వస్థతకు గురైనట్లు సమాచారం. జ్వరతీవ్రత పెరగడంతో మంగళవారం ఉదయం కార్యక్రమాలను మధ్యాహ్ననికి వాయిదా వేశారు. మధ్యాహ్నం నుంచి షెడ్యూల్‌ ప్రకారం కార్యక్రమాల్లో పాల్గొన్నారు.